Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెయ్యి రూపాయలతో బతికెేదెట్టా...
- వేతన జీవోను దసరాలోపు విడుదల చేయాలి : ఎమ్మెల్సీ అలుగుబెల్లి
- వేతనాలు పెంచకుండా కార్మికులను దగా చేస్తున్నారు :పాలడుగు భాస్కర్
- పొమ్మనలేక పొగ బెడుతున్నరు : ఎస్ రమ
- ఇందిరాపార్కు వద్ద మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
- త్వరలో జీవో ఇస్తాం: విద్యాశాఖ అదనపు డైరెక్టర్ లింగయ్య హామీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'వేలాది మందికి తల్లులై సాకుతున్నరు. పేదలకు తిండిపెడుత్నురు. సర్కారు సకాలంలో ఇవ్వకపోయినా అప్పులజేసి మరి పిల్లలను కన్నబిడ్డలవలే చూసుకుంటున్నరు. కానీ వారి బతుకుల్లో వెలుగులు రావడం లేదు. వెయ్యి రూపాయలతో బతికెదెట్టా... రెండువేల రూపాయల జీవో విడుదల జేసేదెన్నడు' అంటూ మధ్యాహ్న భోజన కార్మికుల స్థితిగతులపై ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో అలుగుబెల్లి మాట్లాడారు. అంతకు ముందు 'గౌరవ వేతనం కాదు...కనీసం వేతనం రూ 26వేలు ఇవ్వాలనీ, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలనీ, విద్యార్థులకు కోడిగుడ్డు ప్రభుత్వమే సరఫరా చేయాలనీ, పెంచిన రెండువేల రూపాయల జీవో వెంటనే విడుదల చేయాలనీ, గుర్తింపు కార్డులు ఇవ్వాలి' అంటూ మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున నినదించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ చర్చల కోసం కార్మికులను ఆహ్వానించింది. త్వరలోనే జీవో విడుదల చేస్తామనీ, మెనూకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని విద్యాశాఖ అదనపు డైరెక్టర్ లింగయ్య ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. అనంతరం అలుగుబెల్లి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న వెయ్యి రూపాయలకు మరో రెండువేలు కలిపి మూడు వేల జీవోను ఇవ్వనున్నట్టు అసెంబ్లీలో సీఎం చెప్పారని గుర్తు చేశారు. ఆ హామీలు నీటిమూటలయ్యాయని విమర్శించారు. కనీస వేతనం రూ 19వేలను ప్రభుత్వ నిర్ణయించినా...భోజన కార్మికులకు మూడువేలు ఇవ్వడానికి ఎందుకు ఆలస్యమని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ఏ ప్రాజెక్టులోనైనా వందకు 60 రూపాయలు ఖర్చు అవుతున్నాయనీ, మరో 40 రూపాయలు కమీషన్ల రూపంలో పోతాయని చెప్పారు. కానీ ఉపాధి హామీ చట్టం, మధ్యాహ్న భోజన పథకం మాత్రమే నూటికి నూరు శాతం పేదలకు చేరుతున్నాయని తెలిపారు. నూనె, పప్పులు, కూరగాయల ధరలు పెరిగాయనీ, దానికి అనుగుణంగా మధ్యాహ్న భోజనం కార్మికులకు వేతనాలు పెంచడం లేదని విమర్శించారు. నెలలో 25 రోజులు వంట చేసినందుకుగానూ వెయ్యిరూపాయలు ఇస్తే కార్మికులు ఎలా బతుకుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ బిల్లులు కూడా సకాలంలో రాకపోవడం వల్ల వారు అప్పులు చేసి మరీ విద్యార్థులకు వంట చేసి పెడుతున్నారని చెప్పారు. ఒక నెల బిల్లులు అడ్వాన్స్‌గా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కార్మికులకు ఇస్తానన్న వేతన పెంపుదల జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.వారు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నట్టు చెప్పారు. ఎంఈవో, డీఈవో, కలెక్టర్లకు అనేకసార్లు విన్నవించినా అతీగతీ లేదన్నారు. అసెంబ్లీలో సీఎం హామీ ఇచ్చినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. మధ్యాహ్న భోజనం కార్మికులను విద్యా శాఖ భేఖాతర్ చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కోరికలు చెప్పుకుందామంటే, సచివాలయానికి కంచెలు వేసిందనీ, అలాంటప్పుడు ఎవరికి చెప్పుకోవాలంటూ ప్రశ్నించారు. కార్మికులకు న్యాయం జరిగేదాకా ఉద్యమం ఆపబోమని హెచ్చరించారు. కార్మికులకు ఎర్రజెండా అండగా ఉంటుందన్నారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రమ మాట్లాడుతూ 20 ఏండ్ల నుంచి అలుపన్నదే లేకుండా మధ్యాహ్న భోజన కార్మికులు పిల్లలకు వంట చేసి పెడుతున్నారని చెప్పారు. ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయిన తర్వాతనే వారు హక్కుల సాధన కోసం కదం తొక్కారని తెలిపారు. అటువంటి కార్మికులకు ప్రభుత్వాలు పొమ్మనలేక పొగబెడుతున్నారని విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో పక్క నగదు బదిలీకి కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం సరైందికాదన్నారు. ఒక విద్యార్థికి రూ 7.15 ఇస్తే ఎలా కడుపునిండా ఎలా తిండిపెడతారనీ, ఒక ఖైదీకి రూ 35 ఇస్తుంటే విద్యార్థికి మాత్రం ఇంత తక్కువ ఇస్తారా? అని ప్రశ్నించారు. ఒక్కో అంగన్వాడీకి నెలకు 30 గుడ్లు ఇస్తున్నారనీ, కరోనా కాలంలో ప్రయివేటు ఉపాధ్యాయులకు రెండువేలు, బియ్యం ఇచ్చారనీ, మధ్యాహ్న భోజన కార్మికులను మాత్రం ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి కె నర్సమ్మ, సత్యనారాయణ, ఉపాధ్యక్షులు టి చక్రపాణి, ఎం సులోచన, రాజేశ్వరీ, రాష్ట్ర నాయకులు చిలకమ్మ, సీహెచ్ లక్ష్మి, స్వప్న, మౌనిక, రజిత తదితరులు ఉన్నారు.
మహాసభలకు అలుగుబెల్లి నర్సిరెడ్డి రూ 25వేల విరాళం
మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్ జాతీయ మహాసభలు నవంబర్ 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో జరనున్నాయి. మహాసభల ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తన వేతనం నుంచి రూ 25వేల విరాళం...కార్మిక నాయకులకు అందజేశారు. మహాసభలు విజయవంతం చేసేందుకు కార్మికులు తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు.
పోలీసు అనుమతి నిరాకరణ...నేలపైన్నే ధర్నా
విద్యాశాఖ కమిషనరేట్ వద్ద ధర్నాకు అనుమతి ఇవ్వాలంటూ సీఐటీయూ చేసిన విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారు. ఇందిపార్కు వద్ద ధర్నా నిర్వహించాలని సూచించారు. దీంతో కార్మికులు నానాఅవస్థలు పడ్డారు. ఇందిపార్కు వద్ద టెంట్లు వేసుకునేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. విధిలేని పరిస్థితుల్లో కార్మికులు ఎండకు నేలపైన్నే కూర్చొని తమ హక్కుల కోసం నినదించారు. చాలా చోట్ల కార్మికులను హైదరాబాద్‌కు రాకుండా అడ్డుకున్నారు. కొంత మందిని అరెస్టు చేశారు.