Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్డ్‌స్టోరేజీ నిర్వాహకుల మోసాలు.. ధరల నిలకడలేమితో..
- మిర్చి రైతుల ఊగిసలాట
- మార్కెట్ మాయాజాలంతో అయోమయం
- అవసరాలు, ఆర్థికభారంతో విక్రయాలు
- సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు
- పెట్టుబడి పెట్టిన కమీషన్‌దారుల ఒత్తిడి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మార్కెట్ మాయాజాలంతో ఏసీ మిర్చి రైతులు అయోమయంలో పడ్డారు. ధరల నిలకడలేమితో ఊగిసలాటకు లోనవుతున్నారు. తామరనల్లి ప్రభావంతో అరకొరగా పండిన పంటను ఆశించిన ధరలకు అమ్ముకోవాలని ఆరాటపడ్డారు. ఒక దశలో ధరలు ఊరించడంతో ఆర్థిక భారాన్ని కూడా భరించి కోల్డ్‌స్టోరేజీల్లో మిర్చిని రైతులు నిల్వ చేశారు. కానీ వారి ఆశలను అడియాసలు చేసేలా ధరలు రోజురోజుకూ క్షీణిస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. మరికొన్ని రోజులు ఆపితే ప్రయోజనం ఉంటుందా? లేదా? అని ఆరా తీస్తున్నారు. వ్యాపారులు, కమీషన్‌దారులను ఆశ్రయిస్తున్నారు. తోటి రైతులతో చర్చిస్తున్నారు. అంతటితో ఆగకుండా గుంటూరు, వరంగల్, ఖమ్మం తదితర మార్కెట్ల స్థితిగతులపై రూపొందించిన వీడియోలను యూట్యూబ్‌లోనూ వీక్షిస్తున్నారు. రైతుల ఆరాటాన్ని పసిగట్టిన వ్యాపారులు అయోమయంలో ఉన్న వారిని మరింత గందరగోళానికి గురిచేస్తూ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కమీషన్‌దారులు ఈ ఏడాది మిర్చి పెట్టుబడులు ఊపందు కోవడంతో రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. దేశీయంగా మిర్చి వ్యాపారం విస్తృతంగా జరిగే పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో దసరాను పురస్కరించుకుని దేవీశరన్నవరాత్రుల సందడి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. పైగా చైనా తదితర దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడం వంటవి ధరలు తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. వ్యాపారులు సృష్టిస్తున్న ఈ గందరగోళ స్థితిలో రైతులు ఏమీ పాలుపోని స్థితిలో దాదాపు ఐదు నెలలుగా ఆపిన పంటను ఆశించిన ధర రాకుండానే అమ్ముకుంటున్నారు.
వ్యాపారుల మాయాజాలం...
జూన్‌లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. నెలన్నర కిందట రైతులు మిర్చి నాట్లు వేశారు. మిర్చి నిల్వ చేసుకున్న రైతుల్లో అనేక మందికి పెట్టుబడి డబ్బుల అవసరం ఏర్పడింది. బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోవడంతో బయట అధిక వడ్డీలకు అప్పులు చేయడం ఇష్టంలేని రైతులు ఎగుమతులు లేని ప్రస్తుత స్థితిలో పంటను తెగనమ్ముకుంటున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మార్చి నుంచి జూన్ వరకు క్వింటాల్ మిర్చి రూ.17,000 మొదలు రూ.22,000 వరకూ పలికింది. జులై 19న అనూహ్యంగా రూ.24,000కు చేరింది. 23వ తేదీన 24,300లను తాకింది. ఓ మూడు, నాలుగు రోజుల పాటు ఒకటి, రెండు లాట్లకు అధిక రేటు పెట్టి మిగతా పంటనంతా వ్యాపారులు నమూనా, కనిష్ట ధరలకు కొనుగోలు చేశారు. వ్యాపారులు చేసిన ఈ మాయను గ్రహించలేని రైతులు పలువురు రూ.20వేల లోపు ధరలకే అమ్ముకున్నారు. జిల్లాలోని 42 కోల్డ్‌స్టోరేజీల్లో మార్చిలో 40 లక్షల బస్తాల నిల్వ సామర్థ్యానికి గాను 24 లక్షలు నిల్వ ఉండగా జులై 28వ తేదీ నాటికి 41.23 లక్షల బస్తాల నిల్వకు గాను 19.51 లక్షలు మాత్రమే నిల్వ చేసి మిగిలిన దాదాపు ఐదు లక్షల సంచుల పంటను రైతులు అమ్ముకున్నారు. నాటి నుంచి ధరల్లో మరింత క్షీణత కనిపిస్తుండటంతో ఆందోళనతో రైతులు అమ్మడం ప్రారంభించారు. దీన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈనెల 12వ తేదీ నాటికి 16 లక్షల బస్తాలు స్టోరేజీల్లో ఉండగా శుక్రవారం నాటికి వాటి సంఖ్య 9లక్షల లోపుకు చేరినట్టు జిల్లా మార్కెటింగ్‌శాఖ అంచనా. ఈనెల 15వ తేదీ నుంచి రూ.23వేల ధర పలుకుతుండటంతో రైతులు అమ్మేందుకు ఆసక్తి చూపారు. ఈ నేపథ్యంలో 21వ తేదీ నాటికి 23వేల దిగువకు రూ.22,900కు పడిపోయిన ఏసీ మిర్చి ధరలు మరుసటి రోజుకు మరో 500 తగ్గాయి. శుక్రవారం క్వింటాల్ ఏసీ మిర్చి రూ.22,400 గరిష్ట ధర పలికింది. కానీ ఎక్కువ మొత్తం సరుకును రూ.18 నుంచి 19వేలకు మాత్రమే కొనుగోలు చేశారు.
కోల్డ్‌స్టోరేజీల వద్ద కొర్రీలు..
సాధారణంగా రైతులు కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చిని తెలిసిన లేక పెట్టుబడి పెట్టిన కమీషన్‌దారులకు పలానా రోజు శాంపిల్ పెట్టమని చెబుతారు. ఈ మేరకు సంబంధిత కమీషన్దారు శాంపిల్‌గా ఒక బస్తాను తెప్పించి మార్కెట్లో దించుతాడు. వ్యాపారులు దాన్ని పరిశీలించి రేటు నిర్ణయిస్తారు. ఒకవేళ ఆ రేటు నచ్చలేదని రైతులు చెబితే తిరిగి కోల్డ్స్టోరేజీకి ఆ శాంపిల్ బస్తాను చేరుస్తారు. ధరల స్థితిగతులను బట్టి మరో రోజు శాంపిల్ బస్తాను మార్కెట్‌కు తీసుకువస్తారు. రేటు నచ్చితే కోల్డ్‌స్టోరేజీల్లో బస్తాలను కాంటాలు వేస్తారు. అయితే శాంపిల్ ఆధారంగా ధర నిర్ణయించి కొనుగోలుకు సంసిద్ధత వ్యక్తం చేసిన వ్యాపారులు కొందరు కోల్డ్‌స్టోరేజీల వద్ద కొర్రీలు పెడుతున్నట్టు రైతులు వాపోతున్నారు. శాంపిల్ బస్తా సరుకు నాణ్యత ఉందని, స్టోరేజీలోని మిగతా సరుకులో కొంత భాగం తరుగు ఎక్కువగా ఉందని కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. గత్యంతరం లేక ఎంతో కొంత రేటు తగ్గించుకోమని రైతు చెబితే.. ఆ సరుకును కొనుగోలు చేస్తున్నారు. లేదంటే సంబంధిత సరుకును మళ్లీ స్టోరేజీల్లో వేయించుకోవాల్సి వచ్చేసరికి రైతుకు రూ.వేలల్లో భారం పడుతుంది. అరకొర దిగుబడి, ధరలతో నష్టాల్లో ఉన్న రైతును ఇటు వ్యాపారులతో పాటు అటు కమీషన్‌దారులకు నూటికి రూ.4 నుంచి రూ.8 వరకు కమీషన్లు దండుకుంటూ నిలువునా మోసం చేస్తున్నారని బాధిత రైతులు వాపోతున్నారు.
రూ.10 లక్షల పెట్టుబడి పెడితే రూ.5లక్షలు రాలేదు..
ఈ ఏడాది మిర్చి పంట దిగుబడి సరిగా లేదు. రెండు ఎకరాలు సొంతం, మూడు ఎకరాలు ఎకరం రూ.20వేల చొప్పున కౌలుకు తీసుకుని ఐదు ఎక రాల పంట వేశాను. గతంలో ఎకరానికి 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఈ సారి తామరనల్లి తాకిడికి నాలుగు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ఐదు ఎకరాల పేరు మీద 25 క్వింటాళ్ల పంట వస్తే.. ఎప్పటివి అప్పుడే అమ్మా. ఓ 12 బస్తాలు కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ వేశా. ఇయ్యాళ దాన్ని అమ్మితే క్వింటాల్ రూ.20,600 చొప్పున కొన్నారు. మొత్తం 4.67 క్వింటాళ్లు తూకం వచ్చాయి. అన్ని కటింగ్లుపోతే రూ.85వేల దాకా చేతికొస్తాయేమో. కమీషన్దారుకు పోను నాకు రూ.50వేల మిగుల్తాయేమో.. మొత్తమ్మీద రూ.5లక్షల దాకా అప్పుల్లో పడ్డా. అవితీర్చేదెట్లనో భయంగా ఉంది.
- బాణోత్ హనుమ, రైతు, చిలుకోడు, మహబూబాబాద్.