Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంపెనీ యాజమాన్యానికి అధికారుల అండ!
- ముందు దారిలేదన్న అధికారులే.. తర్వాత ఉందన్నారు
- రూ.20లక్షలకు పైగా చేతులు మారిన వైనం..
- ప్రశ్నించిన పేదలపై అక్రమ కేసులు
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పెద్దోళ్ల కంపెనీకి దారి కోసం పేద రైతుల భూములను ఆక్రమించారు.. భూమి ఇవ్వాలంటూ పేద రైతులను అధికారులే ఇబ్బందులకు గురిచేయడంతో ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని దుస్థితి వారిది.. గతంలో ఇక్కడ ఎలాంటి దాదీఃరీ ఉన్నట్టు ఆధారాలు లేవని చెప్పిన ఆ రెవెన్యూ అధికారి.. తిరిగి కొద్ది రోజుల తర్వాత పేదల భూముల నుంచి కార్పొరేట్ కంపెనీకి రోడ్డు వేయించారు. ఇదేంటని అడిగిన పేదలపై అక్రమ కేసులు పెట్టారు.. ఈ క్రమంలో పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలొస్తున్నాయి.
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ గ్రామానికి చెందిన పడకంటి బక్కయ్య, వీరమ్మ, యాదమ్మ, కృష్ణయ్యతోపాటు వారి అన్నదమ్ములకు 240 సర్వే నెంబర్లో సుమారు 13ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని 60ఏండ్ల కిందట ఇతరుల వద్ద కొనుగోలు చేశారు. అసైన్డ్ భూమి అయినప్పటికీ ధరణిలో నమోదై, రైతుబంధు కూడా వస్తోంది. పంట రుణం, రుణమాఫీ కూడా అయింది. 60ఏండ్లుగా అంటే దాదాపు నాలుగు తరాలుగా ఆ కుటుంబాలు ఆ భూమిని సాగు చేసుకుని జీవిస్తున్నాయి. ఆరుతడి పంటలకు అనువైన భూమి. ప్రస్తుతం ఆ భూమి విలువ ఎకరా సుమారు రూ.కోటి వరకు ఉంది. అయితే, కార్పొరేట్ రంగానికి చెందిన ఓ వ్యక్తి రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అప్పాజిపేట గ్రామ పరిధిలో గుట్టల మధ్య బొక్కల కంపెనీ నిర్మాణం చేపడుతున్నారు. ఆ కంపెనీ వద్దకు వెళ్లడానికి పోలేపల్లి రాంనగర్ గ్రామానికి చెందిన రైతుల భూములు అవసరం. అందుకోసం పడకంటి బక్కయ్య, యాదమ్మ భూమిలో నుంచి ఎకరన్నర ఇవ్వాలని అడిగారు. రూ.కోటిన్నర విలువ గల ఆ భూమికి గిట్టుబాటు ధర ఇస్తేనే ఇస్తామని వారు చెప్పారు. దానికి నిరాకరించిన కంపెనీ యజమాని.. దౌర్జన్యంగా రైతుల భూమి నుంచి దారి ఏర్పాటు చేస్తుండగా.. అడ్డుకున్నారు. అనంతరం తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారణ జరిపిన అధికారులు.. ఇక్కడ దారికి ఎలాంటి నక్ష(మ్యాప్) లేదని, దారి తీయొద్దని కంపెనీ వాళ్లను వెనక్కి పంపారు. కొద్దిరోజుల తర్వాత పరిస్థితి మొదటికొచ్చింది. భూమి ఇవ్వాలంటూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వేధిస్తున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులూ ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ప్రయివేటు కంపెనీ కోసం అధికారులు దగ్గరుండి సహకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాడు దారి లేదన్నది.. ఇప్పుడు ఉందన్నది తహసీల్దారే..
పోలేపల్లి రాంనగర్‌కు చెందిన పడకంటి బక్కయ్య, యాదమ్మ భూమి నుంచి బొక్కల కంపెనీకి వెళ్లడానికి ఎలాంటి దారి లేదని అధికారికంగా ధృవీకరించిన తహసీల్దార్.. కొద్ది రోజుల తర్వాత మాట మార్చారు. సిబ్బందితో వచ్చి దగ్గరుండి దారి తీయించారు. అడ్డుకోబోయిన రైతులపై కంపెనీ వారు దాడి చేసి చితకబాదారు. ఇదంతా తహసీల్దార్ సమక్షంలోనే జరిగినట్టు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుసటి రోజు ఇదేంటని రెవెన్యూ అధికారిని రైతులు ప్రశ్నిస్తే.. కనీసం మహిళలనే కనికరం లేకుండా పోలీసులతో కొట్టించడమే కాకుండా విధులకు ఆటంకం కలిగించారని రైతులపైనే కేసు నమోదు చేశారు. రైతులు జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ లోపు కంపెనీ వాళ్లు దారి చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ యజమాని నుంచి సుమారు రూ.20లక్షలు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి. వీరితోపాటుగా గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, పెద్దల హస్తం కూడా కూడా ఉన్నట్టు సమాచారం. ఆ భూములపై కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ అధికారులు కంపెనీ యాజమాన్యానికి సహకరించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై చింతపల్లి మండల తహసీల్దార్‌కు 'నవతెలంగాణ' ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు.
రెవెన్యూ అధికారులే లంచాలకు ఆశపడి..
మొదట మా భూమిలోనుంచి దారి లేదని చెప్పి కాగితం ఇచ్చిన అధికారే.. ఆ తర్వాత దగ్గరుండి ఎలా దారితీస్తారు. లంచాలకు ఆశపడి చేస్తున్నారు. మా భూమి ఎలా ఇస్తారని అడిగితే కేసులు పెట్టి జైలుకు పంపారు.
- పడకంటి యాదమ్మ- పోలేపల్లి రాంనగర్
మా తాత నుంచి భూమిని సాగు చేస్తున్నం..
మా తాత ఆ భూమిని కొన్నడు. నాలుగు తరాలుగా సాగు చేస్తున్నం. ఇప్పుడొచ్చి అసైన్డు భూమి అంటే ఎట్టా.. కనీసం వృద్ధులమని చూడకుండా మమ్మల్ని కొట్టి కేసులపాలు చేస్తరా.. డబ్బున్నల్లోకి అధికారులు లొంగిపోతే.. గంజి కూడా లేనోళ్లం మా సంగతేంటి?.
- పడకంటి బక్కయ్య- పోలేపల్లి రాంనగర్.