Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్య పోరాటాలతోనే సాధ్యం
- మీ పోరాటానికి ఎర్రజెండా అండ: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు
నవతెలంగాణ-వెంకటాపురం
వ్యవసాయ కూలీలకు కూలి రేటు పెంచే వరకు పోరాడుతామని, కూలీంతా ఐక్యంగా ఉండి పోరాడితేనే అది సాధ్యమవుతుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు పిలుపునిచ్చారు. కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ శనివారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ములుగు జిల్లా వెంకటాపురం మార్కెట్ యార్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ బైటాయించారు. కూలి రేట్లు పెంచాలని, గ్రామాల్లో టాంటాం వేయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్యానం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెంకట్రాములు మాట్లాడారు.
ప్రస్తుతం రైతులు వినియోగిస్తున్న ఎరువులు, పురుగు మందుల వల్ల నేల, నీరు విషపూరితమై పొలాల్లో పనిచేసే కూలీలు అనారోగ్యం బారినపడుతున్నారని చెప్పారు. వారి కూలి రేటు రూ.200 నుంచి రూ.600 పెంచే వరకు పోరాడుదామన్నారు. పోరాటాలను విచ్ఛిన్నం చేయాలని కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వాటిని ప్రతిఘటించి పోరాటం సాగించి కూలి రేటు పెంచుకోవాలన్నారు. గతంలో పోరాటాలు చేసిన గడ్డ వెంకటాపురం మండలం అని గుర్తు చేశారు. కూలీల పోరాటానికి ఎర్రజెండా అండగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 ఏండ్లు గడిచినప్పటికీ కనీస వేతనాల జీవోని సమీక్ష చేయలేదన్నారు. కనీస వేతనాల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతన చట్టం అమలు చేస్తే కూలీలకు వైద్యసౌకర్యం, పిల్లలకు విద్య, వైద్యం అందుతా యన్నారు. రైతులు కూలీలకు సంబంధించిన వివరాలు నమోదు చేయకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగితే కనీసం బీమా కూడా అందడం లేదన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పని చేస్తున్న కూలీలకు సంవత్సరం నుంచి కూలి బకాయిలు ఉన్నాయని చెప్పారు. ఉపాది హామీ కూలీలకు రోజు కూలి రూ.250 ప్రకటించినా రూ 57 కూడా రావడం లేదన్నారు. వ్యవసాయ పనులతో నిమిత్తం లేకుండా ఉపాధి హామీ పనులు కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం స్పందించి తక్షణం కూలి రేట్లు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
అన్ని గ్రామ పంచాయతీల్లో నోటీసు బోర్డులపై పెరిగిన కూలి రేట్ల పట్టికలను ఏర్పాటు చేయాలని కోరుతూ తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బైరెడ్డి సాంబశివ, జిల్లా నాయకులు చిట్టి బాబు, ముత్యం, గ్యానం వాసు, కుమ్మరి శ్రీను, దబ్బకట్ల లక్ష్మయ్య, వంకా రాములు ,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిట్టెం ఆదినారాయణ, సీఐటీయూ నాయకులు కట్ల నర్సింహచారి తదితరులు పాల్గొన్నారు.