Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవోకు గెజిట్ ఇవ్వాలి
- డిసెంబర్లో సిద్దిపేటలో సీఐటీయూ రాష్ట్ర మహాసభ: సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
కార్మిక వేతన సవరణ జీవోను అమలు చేయాలని, ఐదు రంగాల్లో తయారు చేసిన కనీస వేతన సవరణ జీవోకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో జరగనున్న సీఐటీయూ రంగారెడ్డి జిల్లా 3వ మహాసభ వాల్ పోస్టర్ను శనివారం సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన కనీస వేతన సవరణ జీవోను ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్మిక సంఘాల పోరాట ఫలితంగా.. ప్రభుత్వం మొక్కుబడిగా ఐదు రంగాల్లో కనీస వేతన సవరణ జీవో తీసుకొచ్చినా.. గెజిట్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి కార్మికుల కనీస వేతన సవరణలు చేయడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం కార్మికుల పక్షమా..? యాజమాన్యాల పక్షమో తేల్చుకోవాలన్నారు. కనీస వేతనం రూ.5 వేలు చాలంటూ ప్రధాని మోడీ అర్ధరహితమైన మాటలు మాట్లాడుతున్నరని విమర్శించారు. ఎన్నో ఏండ్ల పోరాటాల ఫలితంగా సాధించుకున్న 8గంటల పని దినాన్ని రద్దు చేసి.. 12గంటల పని దినాన్ని అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మళ్లీ బ్రిటీష్ కాలం నాటి పోరాటాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణనంగా వేతన సవరణ చేయాల్సి ఉందన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో సిద్దిపేటలో సీఐటీయూ రాష్ట్ర మహాసభ జరగనుందని తెలిపారు. ఈ మహాసభలో కార్మికుల సమస్యల పరిష్కారానికై, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘమైన చర్చ జరగనుందని చెప్పారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన ప్రణాళికలు రూపొందించనున్నామని తెలిపారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా మహాసభ జరగనుందని చెప్పారు.కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జగదీశ్, చంద్రమోహన్, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కవిత, నాయకులు మల్లేశ్, కురుమయ్య, రుద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.