Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంఘిక సంక్షేమ గురుకులాల సంయుక్త కార్యదర్శి శారద
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యార్థుల ఉన్నత శిఖరాలకు చేరడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కీలకమేనని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సంయుక్త కార్యదర్శి శారద తెలిపారు. హైదరాబాద్ మహేంద్రహిల్స్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాలలో శనివారం ప్రిన్సిపాల్ వినోల అధ్యక్షతన నిర్వహించిన ఇంపాక్ట్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తున్నదనీ, ఉపాధ్యాయులు చదువులు చెబుతున్నారని తెలిపారు. అందువల్ల తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. విద్య, ఆరోగ్య, క్రీడలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు ఆమె తెలిపారు. విద్యావేత్త రేఖారావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగుంటుందని చెప్పారు. దాన్ని గుర్తించి ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. స్వచ్ఛంద సంస్థ ఇన్నర్ వీల్స్ అధ్యక్షురాలు జయంతి కన్నన్ మాట్లాడుతూ విద్యాలయంలో సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి తాము తోడ్పాడునందిస్తామని అన్నారు. ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో తొలి ర్యాంకు సాధించిన విద్యార్థిని నందిని మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇది సాధ్యమైందని చెప్పారు. కార్యక్రమానికి ముందుగా ఏడో తరగతి విద్యార్థినీ కొత్తూరు స్వేచ్ఛాదాస్ మగువా...మగువా పాటకు నృత్యం చేసి ఆకట్టుకున్నారు.
సమస్యలు పరిష్కరించాలి...తల్లిదండ్రులు
కార్యక్రమంలో పలువురు తల్లిదండ్రులు మాట్లాడారు. ప్రభుత్వం ప్రతి విద్యార్థికి రూ.ఒక లక్షకు పైగా ఏడాదికి ఖర్చు పెడుతున్నట్టు ప్రచారం చేసుకుంటుందనీ, క్షేత్రస్థాయిలో మాత్రం సమస్యలు తీరడం లేదని తెలిపారు. కాంపౌండ్ వాల్ లేకపోవడంతో కుక్కల సమస్య తీవ్రంగా ఉందని వాపోయారు. మెస్, యూనిపాం తదితర సమస్యలను ప్రస్తావించారు.