Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
- తీసుకున్న డబ్బులకు ఐదు రెట్లు చెల్లించినా తీరని అప్పు
నవతెలంగాణ - కరీంనగర్ రూరల్
ఆన్లైన్ రుణ యాప్‌ల వేధింపులు ఓ విద్యార్థిని బలితీసుకున్నాయి. తీసుకున్న డబ్బులకు సుమారు ఐదు రెట్లు వసూలు చేసినా వారి ధనదాహం తీరలేదు.. ఫొటోలు, వీడియోలు లీక్ చేస్తామని బెదిరింపులకు పాల్పడటంతో మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా నగునూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కరీంనగర్ పరిధిలోని నగునూర్ గ్రామానికి చెందిన శ్రీధర్, పద్మ దంపతులు వ్యవసాయ చేసుకుంటూ కుమార్తె, కుమారుడు మునిసాయి(19)ని చదివిస్తున్నారు. ఇటీవల ఎంసెట్‌లో మునిసాయి 2000ర్యాంకు సాధించాడు. బీటెక్ కౌన్సెలింగ్ నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లి శంషాబాద్‌లోని స్నేహితుడి గదిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో వ్యక్తిగత ఖర్చుల కోసం ఎం-ప్యాకెట్, ధని యాప్‌లలో నాలుగు నెలల కిందట రూ.10వేల రుణం తీసుకున్నాడు. సరైన సమయానికి ఈఎంఐ చెల్లించలేదని జరిమానాల పేరిట యాప్‌ల నిర్వాహకులు భయపెట్టి ఇప్పటికే రూ.45వేలు వసూలు చేశారు. మరో రూ.15వేలు చెల్లించాలని బెదిరించారు. డబ్బులు చెల్లించకుంటే వ్యక్తిగత ఫొటోలు, సమాచారం సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించడంతో మనస్తాపానికి గురైన మునిసాయి ఈనెల 20న పురుగుల మందు తాగాడు. స్థానికులు అతణ్ని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మృతిచెందాడు. ఉన్నత చదువులకు వెళ్లాల్సిన కొడుకు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కుమారుడిని బతికించుకోవడానికి రూ.3లక్షలకు పైగా ఖర్చు చేసినా ఫలితం దక్కలేదని కన్నీరుమున్నీరయ్యారు.