Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులకు మెరిట్ ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వాలని తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రమోషన్లకు సంబంధించిన సమగ్ర సమాచారం, డిమాండ్లతో కూడిన కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే కుమారస్వామి, ఎమ్ వెంకన్నగౌడ్ మాట్లాడారు. రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో సీనియారిటీ జాబితాను ఇష్టానుసారంగా తయారు చేసి ప్రమోషన్లు ఇచ్చారని తెలిపారు. దీనివల్ల బీసీ ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. 2018లో హైకోర్టు ఉత్తర్వులు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2014 జూన్ 2 నుంచి కల్పించిన అన్ని ప్రమోషన్లు సమీక్షించి, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు వారి రిజర్వేషన్లకు మించి పొందితే, వాటిని పరిశీలించి బీసీ ఇంజినీర్లు, అధికారులు, ఉద్యోగులకు ఇవ్వాలని కోరారు. లేకుంటే విద్యుత్ సంస్థల్లో కులమత భావోద్వేగాలకు అవకాశం కల్పించినవారు అవుతారని హెచ్చరించారు. తక్షణం విద్యుత్ యాజమాన్యాలు దీనిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.