Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వైద్యవిద్యార్థుల బీ కేటగిరి సీట్ల సాధన సమితి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని వైద్యవిద్యలో బీ కేటగిరీలో స్థానిక రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ వైద్యవిద్యార్థుల బీ కేటగిరి సీట్ల సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సమితి రాష్ట్ర అధ్యక్షులు దాసరి రవిప్రసాద్, ముఖ్య సలహాదారు ఇ.చంద్రశేఖర్, సంయుక్త కార్యదర్శి ఎం.అశోక్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఎంతో శ్రమిస్తున్నదనీ, అయితే ఆ ఫలాలు ఇక్కడి విద్యార్థులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేండ్లుగా బీ కేటగిరీ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతున్నదనీ, బీ కేటగిరీలో లోకల్ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున తెలంగాణలోని ప్రయివేటు వైద్య కళాశాలల్లో చేరుతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం సాధనే లక్ష్యంగా సాధించుకున్న స్వరాష్ట్రంలో స్థానిక విద్యార్థులకు అవకాశాలు దక్కకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. తెలంగాణలో వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా వైద్యరంగాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామనీ, అయితే వైద్యవిద్య అభ్యసించడానికి స్థానిక విద్యార్థులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రాష్ట్ర వైద్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ ఏడాది నుంచే బీ కేటగిరీలో స్థానిక రిజర్వేషన్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బీ కేటగిరీ 35 శాతం సీట్లలో కనీసం 30 శాతం వరకు సీట్లను తెలంగాణ విద్యార్థులతో భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బీ కేటగిరీ సీట్ల విషయంలో 33 జిల్లాల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనకు రంగం సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. త్వరలో రాష్ట్ర వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి విన్నవించనున్నట్టు తెలిపారు. తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని సవరించి వెంటనే ప్రభుత్వం జీవో జారీ చేయాలని కోరారు. తమ కార్యాచరణలో భాగంగా విపక్షాల నాయకులను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తామని తెలిపారు.