Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో 140 పై చట్టం మేరకు కమిటీలు వేయాలి
- తెలంగాణ గిరిజన సంఘం
నవతలంగాణ బ్యూరో-హైదరాబాద్
జీవో 140పై హైకోర్టు వ్యక్తం చేసిన అభ్యంతరాలకు ప్రభుత్వమే జవాబివ్వాలని తెలంగాణ గిరిజన సంఘం (టీజీఎస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్ శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 కులోబడి కమిటీలను వేసి పోడుహక్కులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఆ చట్టం ప్రకారం జిల్లా స్థాయిలో కమిటీ వేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా పార్లమెంటు, శాసనసభ్యులను సైతం సమన్వయ కమిటీలో చేర్చటం సరైంది కాదంటూ హైకోర్టు అభ్యంతరాలను వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. రాజకీయ జోక్యం పెరిగితే అనర్హులకు హక్కులు దక్కే ప్రమాదం ఉన్నదంటూ పేర్కొనటంపై రాష్ట్ర ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వాలని కోరారు. సమస్య పరిష్కారం కోసం పోడు సాగుదారుల నుంచి ప్రభుత్వం 3.45 లక్షల దరఖాస్తులను స్వీకరించిందని తెలిపారు. ఏడాది కావస్తున్నా వాటికి పరిష్కారం చూపకపోవటంతో లబ్దిదారులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పిదం వల్ల పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇచ్చే ప్రక్రియ ఆలస్యం జరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటికి హక్కు పత్రాలు ఇవ్వటం ఇష్టం లేని కొన్ని శక్తులు గతం నుంచి ఏదో ఒక కారణంతో న్యాయస్థానాలను ఆశ్రయించి జాప్యానికి కారణమవుతున్నారని విమర్శించారు. 2006లో చట్టం వచ్చిన నాటి నుంచి దాన్ని అమలు కాకుండా ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తుచేశారు. రాజకీయ జోక్యం లేకుండా గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటూ అటవీ, రెవిన్యూ శాఖల అధికారులతో రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శి, జిల్లా స్థాయిలో కలెక్టర్, సబ్ డివిజనల్ స్థాయిలో ఆర్ డీ ఓ, ఎమ్మార్వోలతో కమిటీలను ఏర్పాటు చేయాలనీ అటవీ హక్కుల గుర్తింపు చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు.