Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంజినీరింగ్ కొత్త కోర్సుల పర్మిషన్‌పై స్పందించండి
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఇంజినీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే వరకు రెండో కౌన్సెలింగ్ ప్రక్రియ నిలుపుదలకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. అదే సమయంలో ఇంజినీరింగ్‌లో కొత్త కోర్సులకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ కేసు విచారణను అక్టోబర్ 11కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చినా కొత్త కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ పలు ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ జరిపింది. సీట్ల వివరాలు వెల్లడించడమే కాకుండా కౌన్సెలింగ్ కూడా మొదలైందని, రెండో దశ కౌన్సెలింగ్ ప్రారంభం అయ్యే దశలో కొత్త కోర్సులకు అనుమతి కోరడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. తొలుత ప్రయివేటు కాలేజీల తరఫు న్యాయవాది వాదిస్తూ, ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే తమ కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. సాధారణ కోర్సుల పట్ల విద్యార్థులు మక్కువ చూపడం లేదని, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ లాంటి కోర్సులకే మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వకపోవడంతో సుమారు నాలుగు వేల సీట్లపై ప్రభావం చూపుతుందన్నారు. కొత్త కోర్సులకు అనుమతి ఇచ్చే వరకు రెండో దశ కౌన్సిలింగ్ నిలుపుదల చేయాలని కోరారు. ప్రభుత్వ వివరణ తెలుసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయబోమని హైకోర్టు తేల్చిచెప్పింది.