Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ విద్యారంగాన్ని దెబ్బతీసేలా దసరా సెలవులున్నాయని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) విమర్శించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ నారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్ పద్మారెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధిక సెలవులతో ప్రభుత్వ విద్యకు అపారమైన నష్టం జరుగుతుందనే విషయం విద్యాశాఖ అధికారులకు తెలుసని తెలిపారు. అయినా దసరా సెలవులను 14 రోజులిచ్చి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని సెలవులను ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే అమలు చేస్తాయనీ, ప్రయివేటు స్కూళ్లు అమలు చేయబోవనే విషయం అందరికీ తెలుసని తెలిపారు. ఈనెల 30 వరకు పాఠశాలలు పనిచేస్తాయనీ, వచ్చేనెల ఒకటి నుంచి తొమ్మిది వరకు దసరా సెలవులుంటాయనీ, ప్రయివేటు స్కూళ్లు తల్లిదండ్రులకు సమాచారమిచ్చాయని వివరించారు. వాటిని విద్యాశాఖ అధికారులు ఏమీ చేయలేరని విమర్శించారు.
జులైలో వర్షాల వల్ల నష్టపోయిన పనిదినాలను సరిచేయాలంటూ ఎస్సీఈఆర్టీ ఇచ్చిన ప్రతిపాదనలను తిరస్కరించడం విద్యాశాఖ నియంతృత్వ వైఖరిని నిదర్శనమని పేర్కొన్నారు. నష్టపోయిన పనిదినాలను ఎలా సర్దుబాటు చేస్తారో విద్యాశాఖ సంచాలకులు చెప్పాలని డిమాండ్ చేశారు.