Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1న బాధ్యతల స్వీకరణ
- 30న ఉద్యోగ విరమణ పొందనున్న జలీల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శిగా నవీన్ మిట్టల్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఉన్న సయ్యద్ ఒమర్ జలీల్ ఈనెల 30న ఉద్యోగ విరమణ పొందుతున్నారు. వచ్చేనెల ఒకటిన నవీన్ మిట్టల్ ఇంటర్ బోర్డు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే ప్రస్తుతం ఆయన ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శనివారం జలీల్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఆయన ఉద్యోగ విరమణకు ఆరు రోజుల ముందే నవీన్ మిట్టల్‌ను తదుపరి కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్ బోర్డుకు ఐఎస్వో గుర్తింపు
ఇంటర్ బోర్డుకు ఐఎస్వో 9001:2015 గుర్తింపు వచ్చింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమ కార్యాలయంలోని అన్ని విభాగాల విధులు, పరీక్షల నిర్వహణ, ఫలితాలు, అనుబంధ కాలేజీల గుర్తింపు జారీ చేయడం, కార్యాలయ కంప్యూటరీకరణ, విద్యార్థుల సేవలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం వంటి అన్ని రకాల సేవలనూ, విభాగాలనూ క్షుణ్నంగా పరిశీలించిన హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ ప్రయివేటు లిమిటెడ్ నాణ్యతా ప్రమాణ పత్రం ఐఎస్వో 9001:2015ను జారీ చేసిందని వివరించారు.