Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీడీసీఎల్ సీఎమ్‌డీ గోపాలరావు హెచ్చరిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వన్యప్రాణుల నుంచి పంటలను కాపాడుకొనేందుకు కరెంటు కంచెలు వేస్తే, భూ యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టి, జైళ్లకు పంపుతామని టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎమ్‌డీ అన్నమనేని గోపాలరావు హెచ్చరించారు. కరెంటు కంచెల వల్ల రైతులు, వ్యవసాయ కార్మికులు, పశువులు చనిపోతున్నాయనీ, ఫలితంగా కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయని అన్నారు. ఈ మేరకు శనివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. చేపలు పట్టడానికి కూడా విద్యుత్ పరికరాలను వినియోగిస్తున్నారనీ, ఇది అత్యంత ప్రమాదకరమని చెప్పారు. దీనివల్ల చేపలు పట్టే వ్యక్తులతో పాటు, నీటిలోని జలచరాలన్నీ మృత్యువాత పడతాయని తెలిపారు. చేపలు పట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ గాలాలు ఉపయోగించవద్దని సూచించారు. విద్యుత్ కంచెల వల్ల వన్యప్రాణులు మరణిస్తే, అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేసి, జైళ్లకు పంపుతారనీ, నేరం రుజువైతే గరిష్టంగా పదేండ్లు శిక్ష పడుతుందని తెలిపారు. పంటను కాపాడు కోవడానికి సోలార్ ఫెన్స్ ఎనర్జయిజర్ యంత్రాలు, రికార్డింగ్ మైక్‌లను వినియోగించుకోవాలని సలహా ఇచ్చారు. ఆ శబ్దాల వల్ల అడవి జంతువుల బెడద తగ్గించుకోవచ్చన్నారు. ఎవరైనా రైతులు విద్యుత్ కంచెలు వేసు కుంటే సంబంధింత అధికారులకు ఫిర్యాదు చేయాలనీ, లేకుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250 028 లేదా 1918కు ఫోన్ చేసి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
ఏఈ పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)లో 82 సహాయక ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీలో అర్హత సాధించిన అభ్యర్ధులకు మెరిట్ ప్రాతిపదికన సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నట్టు ఆ సంస్థ సీఎమ్‌డీ శనివారం తెలిపారు. ఈ పోస్టులకు ఆగస్టు 14న పోటీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈనెల 26 న హన్మకొండలోని నక్కలగుట్ట విద్యుత్ భవన్ కార్పొరేట్ కార్యాలయంలో ఈ దృవపత్రాల పరిశీలన జరుగుతుంది. ఇతర వివరాలకు సంస్థ వెబ్సైట్ www.tsnpdcl.inలో తెలుసుకోవచ్చు.