Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూలో అంతర్జాతీయ మైనింగ్ సింపోజియమ్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దేశాభివద్ధిలో ఖనిజ రంగానిది కీలకపాత్ర అనీ, ఈ రంగం ద్వారా అనేకమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించొచ్చని సింగరేణి కాలరీస్ డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డీ సత్యనారాయణరావు అన్నారు. భౌగోళిక అనిశ్చితులు, సాంకేతిక లోపాలు, భిన్నమైన సమాజ అవసరాలు, వాణిజ్య, ఆర్థిక ప్రతిబంధకాలు, సామాజిక ఒత్తిళ్లు వంటి ఇబ్బందులు ఉన్నా, శాస్త్రీయ విశ్లేషణాత్మక సమాచారంతో అన్వేషణలు చేపట్టడం ద్వారా ఈ రంగంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయన్నారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీలో అల్యూమినీ ఆఫ్ మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ (ఓయూ అండ్ కేయూ), అల్యూమినీ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ , ఉస్మానియా వర్సిటీ మైనింగ్ ఇంజినీరింగ్ సంయుక్తాధ్వర్యంలో 'ఖనిజ పరిశ్రమలో ఇటీవలి ధోరణులు' అంశంపై జరిగిన రెండ్రోజుల అంతర్జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎప్పటికప్పుడు సాంకేతికతలను అభివద్ధి చేసుకొని పరిశ్రమలకు అందుబాటులోకి తీసుకురావడం ఖనిజ రంగానికి అత్యవసరమనీ, ఈ దిశగా మైనింగ్ నిపుణులు ఆలోచించాలని సూచించారు. నూతన సాంకేతికతలను దేశీయంగా అభివద్ధి చేయడం ద్వారా పోటీని కూడా తట్టుకొని నిలబడగలుగుతామని చెప్పారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ బీ శ్రీనివాసరావు, డిప్యూటీ డీజీ రంగనాధీశ్వర్, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మెన్ బిక్కి రమేశ్ కుమార్, డాక్టర్ డీ విజరుకుమార్ , కన్వీనర్ కేజే అమర్నాథ్, డాక్టర్ ఎమ్మెస్ వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.