Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజుల ఖరారు ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. 25 కాలేజీ యాజమాన్యాలతో మళ్లీ సంప్రదింపులు జరపాలని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) నిర్ణయించింది. శనివారం హైదరాబాద్‌లో టీఏఎఫ్ఆర్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్ జస్టిస్ పి స్వరూప్‌రెడ్డి, సభ్యులు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, జేఎన్టీయూ హైదరాబాద్ వీసీ కట్టా నర్సింహ్మారెడ్డి, రిజిస్ట్రార్ ఎం మంజూర్ హుస్సేన్, డిప్యూటీ సెక్రెటరీ ఎం సుజాత, చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) జివి లక్ష్మణ్‌రావు, హైకోర్టు న్యాయవాది కె రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్వరూప్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఇంజినీరింగ్ (యూజీ) కోర్సుకు సంబంధించి 2022-23, 2023-24, 2024-25 విద్యాసంవత్సరాల బ్లాక్ పీరియెడ్‌కు 173 ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులను ఖరారు చేశామని చెప్పారు. గరిష్ట ఫీజు రూ.1.60 లక్షలు, కనీస ఫీజు రూ.45 వేలు నిర్ణయించామన్నారు. ఒక కాలేజీ మాత్రం రూ.35 వేల ఫీజు ఉండాలని కోరిందనీ, ఆ కాలేజీ వరకు ఆ ఫీజు ఉంటుందని వివరించారు. అందులో 25 కాలేజీల యాజమాన్యాలు తాము నిర్ణయించిన ఫీజులను అంగీకరించలేదని అన్నారు. అందుకే వాటితో మళ్లీ సంప్రదింపులు జరిపి ఫీజులను ఖరారు చేస్తామన్నారు. అయితే టీఏఎఫ్ఆర్సీ సభ్యులందరూ ఆయా కాలేజీల సంప్రదింపుల సమయంలో భాగస్వాములవుతారని వివరించారు. వారి సయమాన్ని చూసుకుని వీలైనంత త్వరలోనే ఆ కాలేజీలను సంప్రదింపుల కోసం ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మిగిలిన 148 కాలేజీల ఫీజులను ఖరారు చేశామని అన్నారు. మిగిలిన 25 కాలేజీలతో సంప్రదించి ఫీజు ఖరారు చేశాక టీఏఎఫ్ఆర్సీ సమావేశాన్ని నిర్వహిస్తామని వివరించారు. అందులో అన్ని కాలేజీల కాలేజీల ఫీజుల ప్రతిపాదనలను రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.
అందరి దృష్టి సీబీఐటీపైనే...
అందరి దృష్టి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ)పైనే పడింది. 2019-20, 2020-21, 2021-22 బ్లాక్ పీరియడ్‌లో ఆ కాలేజీ ఫీజు రూ.1.34 లక్షలు ఉన్నది. 2016-17, 2017-18, 2018-19 బ్లాక్ పీరియెడ్ అదే కాలేజీ ఫీజు రూ.1.40 లక్షలుగా ఇటీవలే టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసింది. ప్రస్తుత బ్లాక్ పీరియెడ్‌కు సంబంధించి గతంలో సంప్రదించి రూ.1.73 లక్షలుగా ఖరారైంది. ఈనెలలో మళ్లీ సంప్రదించి తాజాగా సీబీఐటీ ఫీజు రూ.1.12 లక్షలుగా టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించింది. ప్రముఖ కాలేజీ ఫీజు తగ్గడమేంటన్న చర్చ జరుగుతున్నది. ఫీజు తగ్గడానికి ఆ కాలేజీ వద్ద రూ.14 కోట్ల వరకు మిగులు నిధులుండడంతో దాన్ని ఆదాయంగా టీఏఎఫ్ఆర్సీ పరిగణించింది. అందుకే ఆ కాలేజీ ఫీజును రూ.1.73 లక్షల నుంచి రూ.1.12 లక్షలకు తగ్గించారు. అంటే రూ.61 వేలు కోత పడింది. దీనిపై ఆ కాలేజీ యాజమాన్యం అభ్యంతరం చెప్తున్నది. తమ కాలేజీ బ్యాంక్ అకౌంట్లో రూ.14 కోట్ల నిధులున్న మాట వాస్తవమేననీ, కానీ ఆ డబ్బు కాలేజీకి సంబంధించింది కాదంటూ టీఏఎఫ్ఆర్సీకి చెప్పినట్టు తెలిసింది. తాము విద్యార్థుల నుంచి టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన దానికంటే అదనంగా ఫీజు వసూలు చేశామనీ, ఆ డబ్బే తమ కాలేజీ అకౌంట్లో జమ అయ్యిందని వివరించినట్టు సమాచారం. ఎక్కువ ఫీజు చెల్లించిన విద్యార్థులకు ఆ సొమ్మును తిరిగి చెల్లించాలని చెప్పినట్టు తెలిసింది. విద్యార్థులకు ఫీజు తిరిగి చెల్లిస్తే తమ కాలేజీ వద్ద రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల నిధులే ఉంటాయనీ, అందుకే ఫీజును తిరిగి ఖరారు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఇలా ఇతర కాలేజీలకు సంబంధించి ఆదాయ, వ్యయాలనూ మరోసారి పరిశీలించి ఫీజు ఖరారు చేసే అవకాశమున్నది. అయితే టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజులను అంగీకరించని జాబితాలో సీబీఐటీ, వీఎన్ఆర్ విజ్ఞాన్‌జ్యోతి, జి నారాయణమ్మ, వర్ధమాన్, శ్రీనిధి, కేశవ్ మెమోరియల్, మల్లారెడ్డి, అనురాగ్ ఇంజినీరింగ్ కాలేజీలున్నట్టు తెలిసింది.