Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో గుర్తింపు లేని పనితో కార్మికుల అవస్థలు
- ధరలు పెరుగుతున్నా పెరగని జీతం
- హామీలకోసం నేడు ఆందోళన బాట
'గురుకులాల్లో పది సంవత్సరాల సర్వీసు ఉన్నవారందరినీ రెగ్యులరైజ్ చేస్తాం. అధికారులు అందుకు తగిన కసరత్తు చేయాలి. వెంటనే సర్క్యులర్ విడుదల చేయండి'.-2016లో సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పిన మాట.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికుల బతుకు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అధికారుల నిర్లక్ష్యంతో ఆరు నెలలుగా జీతాలు రాక వారు అష్టకష్టాలు పడుతున్నారు. కన్నబిడ్డలకు కూడా నాలుగు ముద్దలు పెట్టలేని తమ దుస్థితిని తలుచుకుని గోసపడుతు న్నారు. చేతులో చిల్లి గవ్వలేకపోవడంతో పండుగపూట పస్తులుండగూడదని చేబదుళ్లకోసం పాకులాడుతున్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకపోవటమే కాకుండా..ఇవ్వాల్సిన అరకొర జీతాలను కూడా నెలనెల ఇవ్వకపోవటంతో సర్కారుపై కార్మికులకు అసంతృప్తి పెరుగుతోంది. ఈ విషయాన్ని ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ఉపయోగం లేకుండా పోతున్నదని వారు వాపోతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా అమలు చేయకపోతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సాధకబాధకాల్లో భాగమవుతున్న తమ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని వేడుకుంటున్నారు.
ఇంత జరుగుతున్నా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయటం లేదు. చేసిన పనికి ఇవ్వాల్సిన వేతనం ఇవ్వటం లేదు. నెలల తరబడి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ బకాయిలను విడుదల చేయమన్నా..సర్కార్ కనికరించటం లేదు. రాష్ట్రంలో మూడు వేల మందికి పైగా కార్మికులు వేతనాలు సకాలంలో రాక..ఇబ్బంది పడుతున్నారు. దసరాపండక్కైనా ఇస్తరో..ఇవ్వరోనని ఆందోళ పడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో కుస్తి పడలేక ఇంట్లో ఇక్కట్లు పడుతున్నారు.
16 గంటలు పనిచేయాల్సిందే..
తెల్లవారు జాముల ఐదు గంటలనుంచి వారి పని ప్రారంభమవుతుంది.రాత్రి తొమ్మిది పది గంటల వరకు వారు అదే పనిలో ఉంటారు . సుమారు 16గంటలు కష్టపడుతున్నా తగిన గుర్తింపు, పెరగని జీతంతో ఇబ్బందులు పడుతున్నారు. వాచ్మెన్, వంట, స్వీపింగ్, స్కావెంజర్, అటెండర్, ఆస్పత్రి డ్యూటీ వరకు అన్ని పనులు చేస్తుంటారు.ఇది చాలదన్నట్టు మార్కెట్‌కు పోయి సరుకులు తీసుకురావటం, గ్యాస్, బియ్యం తదితర పనులన్నీ వీరు చేయాల్సిందే..ఇన్ని పనులు చేస్తున్నా..ఎక్కడ ఏ లోపం జరిగినా ఆ నెపాన్ని తమపైనే అధికారులు వేస్తున్నారనీ, ఇదేంటని అడిగితే నువ్వు రేపటి నుంచి పనిలోకి రావాల్సిన అవసరం లేదంటూ బెదిరిస్తుంటారని కార్మికులు వాపోతున్నారు.
కనీస వేతనాల జీవో కనుమరుగు..
జిల్లా అధికారులు కనీస వేతనాల జీవోను అమలు చేయటం లేదు. ఇదేంటని అడిగితే..రకరకాల సాంకేతిక సమస్యలను చూపెట్టి కాలం గుడుపుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నాటి కలెక్టర్, లేదా సంబంధిత అధికారులు విడుదల చేసిన సర్క్యులర్‌ను కొత్త జిల్లా అధికారులు అమలు చేయటం లేదు ..ఆ సర్క్యులర్‌ను తాము విడుదల చేయలేదంటూ కుంటి సాకులు చెబుతున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడటంతో పాత సర్క్యులర్లను అమలు చేయటంలో చిక్కులు ఉన్నాయంటూ అధికారులు చెబుతున్నారు.దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు.
జిల్లాకో తీరు..
కార్మికులకు సంబంధించి ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఆరు నుంచి పది నెలల పాటు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి.దసరా పండుగ నాటికైనా పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని అధికారులను వారు వేడుకుంటు న్నారు. పార్ట్‌టైం పేరుతో రోజుకు 16గంటల పనికి స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నారు. పార్ట్‌టైం పద్దతిని రద్దుచేసి, డైలీ వేజ్ వర్కర్లకు ఇచ్చే పూర్తి వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జీతం, చట్టబద్ధ మైన పీఎఫ్,ఈఎస్ఐ, ప్రమాదబీమా వంటి సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వం శ్రమదోపిడీకి గురిచేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వతీరుకు నిరసనగా సోమవారం ఆందోళనబాట పట్టనున్నట్టు కార్మికసంఘాలు తెలిపాయి.
'పదిహేనేండ్లుగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఔట్ సోర్సింగ్ వర్కర్‌గా పనిచేస్తున్నాను.రోజుకి 16 గంటలు కష్టపడుతున్న. అయినా ప్రభుత్వం ఇచ్చే జీతం ఆరు వేలు. ఇల్లు ఎల్లటం కష్టమైతాంది. పేరుకు ఔట్ సోర్సింగేకానీ..ఆ పేరుతో ఉన్నవారికి ఇచ్చే వేతనం కూడా ఇవ్వటం లేదు. మా పనికి గుర్తింపు కావాలని ఎన్నో సార్లు అధికారుల దగ్గర మొరపెట్టుకున్నాం. పట్టించుకునే నాథుడే లేడని అర్థమైంది'.
- టేకం ప్రభాకర్, (ఆసిఫాబాద్)
'కూరగాయల దగ్గరనుంచి..మార్కెట్లో కొనాల్సిన అన్ని వస్తువులను మేమే కొని తెస్తాం.వాటితోపాటు వాచ్మెన్ డ్యూటీ నుంచి స్కావెంజర్ పని వరకు చేస్తున్నాం. రోజుకు 12 గంటలనుంచి 16 గంటల వరకు ఆశ్రమ పాఠశాలలోనే ఉంటున్నాం.అదే మాఇల్లు. విద్యార్థులే మా కన్న పిల్లలు. కానీ.. మా పనికి గుర్తింపు లేదు. ఇదేంటని అడిగితే..పట్టించుకోని వైనం'..
-జలందర్ (భద్రాద్రి కొత్తగూడెం)