Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడులోకి వెళ్లనీయండా అధికారుల అడ్డగింత
- భూమి లాక్కుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధం
- క్రిమిసంహారక మందు డబ్బాలతో మహిళల నిరసన
నవతెలంగాణ-అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో పోడు వివాదం రగులుతోంది. శుక్రవారం మండలంలోని రెడ్డిగూడెం పంచాయతీ బండారు గూడెంలో రాజుకున్న పోడు భూమి వివాదం శనివారం ఒక కొలిక్కి వచ్చిందో లేదో ఆదివారం గాండ్లగూడెంలో గిరిజన మహిళలు కొందరు అటవీ అధికారులను అడవిలోకి వెళ్ళకుండా గ్రామంలోనే అడ్డుకున్నారు. పైగా పురుగు మందులు డబ్బాలు పట్టుకుని మరీ ఆందోళనకు దిగారు. దాంతో ఒక్కసారిగా అటవీ అధికారులు, పోలీసులు ఉలిక్కి పడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏండ్ల తరబడి చమటోడ్చి పోడు చేసుకుని సాగు చేసుకుంటున్న భూముల్లో ఫారెస్ట్ సిబ్బంది వచ్చి ఈ భూములు మావంటూ వేసిన పంటలు నాశనం చేస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. పంటలకు మందులు కూడా పిచికారీ చేయనీయడం లేదని, అసలు ఏ వ్యవసాయ పనులు చేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానసికంగా వేధిస్తున్నారంటూ పురుగు మందు డబ్బాలతో ఆందోళన బాట పట్టారు. అడవిలోకి వెళ్లనీయకుండా అటవీ అధికారులను పోడు సాగుదారులు అడ్డుకున్నారు. పోడు భూమి లాక్కుంటే ఊరుకోమని హెచ్చరించారు. 2005లో ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పోడు భూములకు పట్టాలు ఇచ్చారని మళ్ళీ ఎంతమంది ప్రజాప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టుకున్నా తమ పోడు భూములకు హక్కులు కల్పించడం లేదని ఆవేదన చెందుతున్నారు. తాము పోడు చేసుకున్నది ఎకరం, అరెకరం భూములేనని ఈ భూములు సాగు చేసుకుని తమ పిల్లలను చదివించుకుంటున్నామని, ప్రభుత్వం అర్ధం చేసుకుని తమ భూములకు హక్కులు కల్పించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పట్టించుకోకపోవడం పట్ల అసహన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే పోడు భూమి వ్యవహారంలో ఎమ్మెల్యేను అనేక సార్లు కలిసి తమ బాధలను విన్నవించినప్పటికీ పట్టించుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫారెస్ట్ అధికారులు అశ్వారావుపేట పోలీసులు, తహసీల్దార్‌కు విషయం తెలపడటంతో వారు సంఘటనాస్థలికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. ఎఫ్డీఓ రెండు రోజుల్లో వచ్చి తమ సమస్యలను పరిష్కరిస్తారని, అప్పటివరకు ఆయా భూముల్లోకి వెళ్ళవద్దని తహసీల్దార్ చల్లా ప్రసాద్, సీఐ బాలకృష్ణ గ్రామస్తులకు చెప్పి వెళ్ళిపోయారు. దాంతో ఫారెస్ట్ అధికారులు కూడా అక్కడనుండి వెనుతిరిగారు. ఒకవేళ ఫారెస్ట్ అధికారులు రైతులపై దాడికి దిగితే మందు తాగి ప్రాణ త్యాగానికైనా సిద్ధమని, తమ భూములను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని గిరిజన రైతు మహిళలు చెప్పడం విశేషం. రైతుల ఆందోళనపై స్పందించిన ఎఫ్ఆర్వో అబ్దుల్ రహ్మాన్ మాట్లాడుతూ.. పంటలకు పురుగు మందుల పిచికారీతో అటవీ జంతువులు మృత్యువాత పడతాయని, దాంతో జీవవైవిధ్యం నాశనం అవుతుందన్న విషయమై అవగాహన కల్పించడానికి వెళ్తుంటే అక్కడ గిరిజనులు తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని తెలిపారు.