Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గర్ల్స్దీ అదే తీరు
- నగరంలో పెరుగుతున్న దాడులు
- పెరిగిన పెట్రోలు ధరలతో గిట్టుబాటుకాని వైనం
- సకాలంలో అర్డర్స్ ఇవ్వని కంపెనీలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎండనక, వాననక, చలి లెక్కచేయకుండా కరోనా లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టి నగరవాసులకు సేవలందించారు డెలివరీ బాయ్స్. ఆకలి, దప్పికలను సైతం లెక్కచేయకుండా పదిమంది ఆకలి తీరుస్తున్నారు. 5 స్టార్ రేటింగ్ ఇస్తే ప్రపంచాన్నే జయించినంతగా ఎగిరి గంతులేస్తూ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌లో ముందువరుసలో ఉన్నారు. పండుగల్లేవు.. సెలవుల్లేవు.. ఆదివారాలు అసల్లేవు. ఉదయం 6గంటలకు ప్రారంభిస్తే రాత్రి ఎంత సమయం అవుతుందో తెలియని పరిస్థితి. గ్రేటర్‌లోని ట్రాఫిక్ సుడిగుండంలో పార్శిల్‌ను సమయానికి అందించడం కష్టమే. కాని ఆర్డర్ చేసిన పార్శిల్ సకాలంలో రాకపోతే.. తిట్లతోపాటు దెబ్బలు కూడా తప్పడంలేదు. రాత్రింబవళ్లు కష్టపడిపనిచేస్తే కస్టమర్లతో ఇబ్బందులు ఒకవైపైతే.. మరోవైపు వారికి రావాల్సిన డబ్బులు సకాలంలో రాని పరిస్థితి.
దిగ్గజ డెలివరీ యాప్ స్విగ్గి, జొమాటో, అమెజాన్, ఫ్లిప్‌కార్డు, జియోమార్ట్, ఫిజాహర్ట్, బిగ్ బాస్కెట్, మిషో, మిన్త్రా, స్నాప్‌డీల్, ఫ్రెష్టూచ హోమ్, కేఎఫ్‌సీ, షాపుషి వంటి సంస్థల్లో నగరంలో 15వేల మంది ఉంటారని అంచనా. తినే తిండి మొదలుకుని అలంకార వస్తువుల వరకు డెలివరీ బాయ్స్, గర్ల్స్ అందిస్తున్నారు. అయితే ఫుడ్‌కు సంబంధించిన డెలివరీ య్స్ ఎక్కువ మంది ఉన్నారు.
దాడులు ఇలా...
డెలివరీ బాయ్స్‌పై తరుచుగా దాడులు జరుగుతున్నాయి. మాదాపూర్‌లో ఓ హోటల్ సకాలంలో పుడ్ అందించకపోవడంతో పార్శిల్ అందించడం ఆలస్యమైంది. దాంతో కోపోద్రిక్తులైన కస్టమర్ కత్తితో డెలివరీ బాయ్ భుజంపై దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చైతన్యపురిలో స్విగ్గి డెలివరి బాయ్‌పై పట్టపగలు అందరు చూస్తుండగానే గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేస్తే ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. దీనిపై సదరు సంస్థ కనీసం సానుభూతి చూపకపోవడం విడ్డూరం. బేగంపేట్‌లో రాష్‌గా మాట్లాడాడని బాయ్‌పై కస్టమర్ దాడిచేశాడు. కోకాపేట్లో పార్కింగ్ ఏరియాలో చిన్నపాటి సమస్యకు మాల్స్ బౌన్సర్లు తీవ్రంగా దాడిచేశారు. మచ్చుకొన్ని మాత్రమే ఇలాంటి దాడులు అనేకం ఉన్నాయని బాయ్స్ అందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇలా లేట్‌గా ఎందుకు వచ్చావు కదా డబ్బులు ఎందుకివ్వాలని మరొకరు.. హోటల్స్, రెస్టారెంట్ల దగ్గర పార్కింగ్ ఏరియాలో ఇంకొకరు ఇలా డెలివరీ బాయ్స్‌పై తరుచూ దాడులు జరుగుతూనే ఉన్నాయి.
గిట్టుబాటుకాని రేట్లు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో డిగ్రీలు, పీజీలు పట్టాలు తీసుకుని ఖాళీగా ఉండేకన్నా కనీసం డెలివరీ బాయ్స్‌గా అయినా పనిచేసుకుందామని వస్తే పెరిగిన పెట్రోలు ధరలు గుదిబండగా మారాయి. గతంలో ఒక్కో అర్డర్‌కు రూ.80 ఇచ్చేది. పైగా నాలుగు కిలోమీటర్ల పరిధిలోనే తిరగాల్సి వచ్చేది. కానీ కరోనా తర్వాత కిలోమీటర్‌కు రూ.6లు చెల్లిస్తున్నారు. ఇచ్చేది డబ్బులు సకాలంలో ఇవ్వడంలేదు. 12గంటలు పనిచేసినా రూ.500దాటడంలేదు. దాంతోపాటు పార్శిల్ రిటర్న్ చార్జీలు ఇవ్వడంలేదు. దాంతో పెట్రోలు ఖర్చు కూడా రావడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. డెలివరీ బాయ్స్ అండ్ గర్ల్స్ కనీస చార్జి రూ.35, రిటర్న్ అర్డర్ చార్జీలను రూ.20, ప్రతి కిలోమీటర్‌కు చెల్లించే మొత్తాన్ని రూ.6 నుంచి రూ.12లకు పెంచాలని బాయ్స్ డిమాండ్ చేస్తున్నారు. అర్డర్‌ను మధ్యలోనే కాన్సిల్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నారు.
దాడులను అరికట్టాలి
హైదరాబాద్ నగరంలో డెలివరీ బాయ్స్‌పై రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయి. డెలివరీ బార్సు అంటే కస్టమర్స్‌కి, సెక్యూరిటీకి విలువలేకుండా పోయింది. వివిధ ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటంలేదు. డెలివరి బాయ్స్ ఉన్నత చదువులు చదువుకొని ఆర్థిక ఇబ్బందులతో బార్సు సర్వీస్ చేస్తున్నారు. కస్టమర్స్ అర్థం చేసుకుని గౌరవం, ఇచ్చిపుచ్చుకోవాలి. డెలివరి బాయ్స్ అండ్ గర్ల్స్ భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- గ్రిగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) హైదరాబాద్ నగర అధ్యక్షులు టి.మహేందర్