Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 236 ఎకరాలు ఇతర శాఖలకు బదలాయింపు
- మిగిలేది భవనాలే..
- దక్కన్ నల్లజాతి గొర్రెల ఉత్పత్తిపై ప్రభావం
- పరిశోధన కేంద్రాన్ని అక్కడే కొనసాగించాలి:గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిల్లె గోపాల్
పశు పరిశోధనా కేంద్రం నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దక్షిణ తెలంగాణలో ఏకైక పశు పరిశోధన కేంద్రానికి గడ్డుకాలం దాపురించింది. పరిశోధనలకు సరైన ల్యాబ్ సౌకర్యం కోసం నిధులు లేనందున నత్తనడకన కొనసాగుతున్నది. ఇప్పటికే ప్రభుత్వాల ఆదరణ లేక కునారిల్లుతున్న కేంద్రం.. ఇకపై మూతపడే ప్రమాదం ఏర్పడింది. దాని భూములను ఇతర శాఖలకు ప్రభుత్వమే బదలాయించింది. ఇక పరిశోధనా కేంద్రానికి కేవలం భవనాలు మాత్రమే మిగలనున్నాయి.
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లిలో 1950లో దక్కన్ జాతి గొర్రెల పెంపకం కోసం 236 ఎకరాల స్థలంలో పశుపరిశోధనా కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది 1993 వరకు పశుసంవర్ధక శాఖ పరిధిలో కొనసాగింది. ఆ తర్వాత ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం పరిధి నుంచి పివి నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో భాగంగా కొనసాగుతోంది. గొర్రెలు, మేకలను ఉత్పత్తి చేయడానికి మేత కోసం భూమి అవసరం ఉంటుంది. అందుకే 236 ఎకరాల భూమిని పశుపరిశోధన కేంద్రం కోసం కేటాయించారు. తాజాగా పశుపరిశోధన కేంద్రం భూమిలో 100 ఎకరాలను పాలమూరు యూనివర్సిటీకి ఇచ్చారు. ఆర్టీఓ కార్యాలయానికి నాలుగెకరాలు తీసుకున్నారు. జిల్లా కోర్టుల సముదాయానికి 15 ఎకరాలు తీసుకునేందుకు ఒప్పందం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. మిగతా భూమి నుంచి 150 పీట్ల వెడల్పు గల బైపాస్ రోడ్డు వెళ్లనుంది. ఇక పరిశోధన కేంద్రానికి కేవలం వెటర్నరీ పాలిటెక్కిక్, హాస్టల్ భవనం మిగలనుంది. బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు జరిగితే ఇక్కడి నుంచి పశు పరిశోధన కేంద్రాన్ని ఆరు నెలల్లో ఖాళీ చేయాల్సి వస్తుంది. పరిశోధన కేంద్రానికి ప్రత్యామ్నాయ స్థలం చూపించకుండానే.. సుమారు రూ.100 కోట్ల విలువైన పరిశోధనా కేంద్రం భూమిని ఇతర శాఖలకు బదలాయించడం సరికాదని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనుమరుగవుతున్న దక్కన్ నల్లజాతి గొర్రెలు
దక్కన్ నల్లజాతి గొర్రెల సంతతిని కాపాడుకోవడానికి ఈ పశు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఆదిలాబాద్ ఇతర ప్రాంతాలకు వలసలు పోవడం వల్ల సంకరజాతిగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఎర్రజాతి పొట్టేళ్లను ఇవ్వడం వల్ల నల్లజాతి గొర్రెలు ఉనికిని కోల్పోతున్నాయి. అందుకే నల్లజాతిపై గొర్రెల కాపరులకు శిక్షణ, యాజమాన్య పద్ధతులు తదితర వాటిపట్ల ఇక్కడ శాస్త్రవేత్తలు చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా అధిక సంతాన ఉత్పత్తి గొర్రెలను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. పీజీ విద్యార్థులు పరిశోధన కూడా చేస్తారు. ఇక్కడి నుంచి రక్త నమూనాలను సేకరించి హైదరాబాద్లో పరిశోధనలు చేసి మెరుగైన దక్కన్ గొర్రెల పెంపకానికి దోహదపడతారు.
బదలాయిస్తే.. ఊరుకోం
కురుమూర్తి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి, మహబూబ్నగర్
పశుపరిశోధన కేంద్రాన్ని మరో ప్రాంతానికి బదలాయించడం భావ్యం కాదు. అందులో సిబ్బంది 30 ఏండ్లుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. సుదూర ప్రాంతాలకు పరిశోధన కేంద్రాన్ని బదలాయిస్తే.. రాకపోకలకు భారమవుతుంది. అందువల్ల ఆ పరిశోధనా కేంద్రానికి మరో ప్రాంతానికి తరలించొద్దు.
ఇక్కడే కొనసాగించాలి
వెనకబడిన పాలమూరు జిల్లాలో ఉన్న పశుపరిశోదన కేంద్రం ఇక్కడి గొర్రెలు మేకల పెంపకం దారులకు ఎంతో ఉపయోగపడుతోంది. మెరుగైన ఉత్పత్తితో పాటు అధిక ఆదాయం ఇచ్చే జాతిని ఇక్కడ ఉత్పతి చేస్తారు. ఈ రంగానికి ప్రభుత్వమే చేయూత ఇవ్వాల్సింది పోయి నిర్వీర్యం చేస్తోంది. పశు పరిశోధనా కేంద్రాన్ని మరో దగ్గరకు మార్చితే ఊరుకోం. జాతీయ రహదారి దగ్గర ఉన్న ఈ పరిశోధన కేంద్రాన్ని ఇక్కడే కొనసాగించాలి. లేనిచో ఉద్యమం తప్పదు.
- కిల్లెగోపాల్- గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు