Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చాడ పుస్తకావిష్కరణలో మండలి చైర్మెన్, స్పీకర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికీ వామపక్ష పార్టీలు విలువలతో ఉన్నాయనీ, ఆ పార్టీ నాయకులకు ప్రత్యేక స్థానమున్నదని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. సీపీఐ మాజీ శాసనసభాపక్ష నేత చాడవెంకట్‌రెడ్డి రాసిన పుస్తకం కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు ఎంతో ఉపయోగ పడుతుందనీ, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయ మన్నారు. శాసనసభలో చాడ వెంకట్‌రెడ్డి రచించిన 'అసెంబ్లీ సాక్షిగా నా పోరాటం' అనే ప్రసంగాల సంపుటిని చైర్మెన్, స్పీకర్...తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో బుధవారం ఆవిష్కరించారు. మొదటి ప్రతిని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అందజేశారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే శక్తులతో సంఘటితంగా పోరా టం చేయాలనీ, తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవాలని వారు సూచించారు. మతాలు, కులాలకు అతీతంగా, అందరూ జీవించే హక్కు కోసం పోరా డాలని పిలుపునిచ్చారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. కమ్యూనిస్టు నాయకులతో తనకు బాగా ఆత్మీయత ఉన్నదని తెలిపారు. సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి ప్రసంగాల పుస్తకాన్ని కూడా తీసుకురావాలని సూచించారు. కమ్యూనిస్టు నేతల ప్రసంగాల్లో అసందర్భ వ్యాక్యలు ఉండబోవన్నారు. ప్రచారం కోసం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాట్లాడుతారని గుర్తు చేశారు. చాడ కంటే తాను సీనియర్ అయినప్పటికీ ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నదని చెప్పారు. మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ చాడ వెంకట్ రెడ్డి పుస్తకం కొత్తగా వచ్చే శాసనసభ్యులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. చాడతో తనకు మంచి అనుబంధం ఉన్నదనీ, అనేక ఉద్యమాలు, పోరాటాల్లో కలిసి పనిచేశామని చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించే క్రమంలో అప్పటి ప్రభుత్వా న్ని ఇరుకున పెట్టేలా వ్యూహాలు చేసేవారిమని వివ రించారు. నాడు 610 జీవో అంశంపైన జరిగే శాసన సభా పక్షం సమావేశానికి గంట ముందే తాను, చాడ వచ్చేవాళ్లమనీ, ఉద్యోగుల ద్వారా దరఖాస్తులు స్వీకరించి, వారికి ఉద్యోగాలు వచ్చేలా చేశామని గుర్తు చేశారు. సీపీఐ మాజీ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్, శాసనసభలు ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రతి బింబంగా ఉండాలని ఆకాంక్షించారు. చట్టసభలు ప్రజా సమస్యలను లేవనెత్తే ముఖ్యవేదికలని గుర్తు చేశారు. పార్లమెంట్ సమావేశాలు వంద రోజుల పాటు జరపాలంటూ సీపీఐ ప్రతిపాదిస్తే అందుకు స్పీకర్ సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ ప్రభుత్వం కారణంగా అమలు చేయలేదని వివరించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని, చట్టసభలను కాపాడుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. ఒకే దేశం, ఒకే మతం పేరుతో చట్టసభలు లేకుండా చేసే పరిస్థితులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చాడ రాసిన పుస్తకాలు ఇక మ్యూజియంలోనే కనిపిస్తాయోమోననీ, అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు ఇలా కొనసాగాయా? అనే పరిస్థితులు వస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండానే ఏకపక్షంగా రైతుల భవిష్యత్తును నాశనం చేసే రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ఎంపీ కేఆర్ సురేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి డాక్టర్ వేదాంత నర్సింహా చార్యలు, పుస్తక ప్రచురణకర్త ఐరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాపక్షం సంపాదకులు కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు.