Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన
- పోలీసుల సమక్షంలోనే బాధితులపై దాడికి దిగిన వైద్యులు
- కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడ్డా కనికరించని వైద్యులు
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ జిల్లా కేంద్రప్రభుత్వాస్పత్రిలో రోగుల మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొన్న బాలింత.. నిన్న నాలుగురోజుల పసికందు మరణాలు మరువకముందే మరో రోగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాంతో మృతుని బంధువులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని ఆరోపిస్తూ ఆస్పత్రిలో ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకోగానే పోలీసుల సమక్షంలో ప్రభుత్వ వైద్యులు ఆస్పత్రిలో బాధితులపై దాడికి దిగారు.బాధితులు కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడ్డా వైద్యులు కనికరించలేదు. ఈ ఘటన బుధవారం నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ పట్టణ జామా మసీద్ కేంద్రానికి చెందిన కంది బుచ్చిరాములు(50) గతంలో స్థానిక నటరాజ్ థియేటర్లో గార్డుగా పనిచేసేవాడు. ఆరు నెలల కింద హెచ్ఐవీ అని తేలడంతో ఆయన అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. బుధవారం ఉదయం బుచ్చిరాములు ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన కుమారులు హుటాహుటిన ప్రభుత్వ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించారు. ఆ సమయంలో ఓపీలో ఉన్న నర్సు బుచ్చిరాములు పరిస్థితిని చూసి ఐసీయూకు తరలించారు. వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆ సమయంలో డ్యూటీ డాక్టర్ వేరే వార్డుల్లో రోగులను పరీక్షిస్తుండగా కుమారుడు తొందరగా డాక్టర్ను పిలిపించి తన తండ్రికి వైద్యం చేయాలని సిబ్బందిని వేడుకున్నాడు. సిబ్బంది డాక్టర్ను తీసుకొచ్చేసరికి అప్పటికే బుచ్చిరాములు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన తండ్రి మృతిచెందాడని పేర్కొంటూ బంధువులతో ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. దాంతో టూటౌన్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి సిబ్బందితో ఆందోళన విరమించేందుకు ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసుల రాకతో వైద్యులు వీది రౌడీల్లా మారారు. పోలీసుల సమక్షంలోనే భాదితులపై డాక్టర్లు దాడికి దిగారు. బాధితులు వైద్యుల కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడ్డా కనుకరించలేదు. ప్రభుత్వాస్పత్రిలో ఉద్రిక్తత నెలకొంది.