Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వం కోల్పోతామంటున్న నిర్వాసితులు
నవతెలంగాణ-నర్సాపూర్
సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతుల భూములు రీజినల్ రింగ్ రోడ్డులో పోతున్నాయని భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భూ సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను శుక్రవారం రైతులు అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగిన తర్వాతే భూసర్వే పనులు చేపట్టాలని అధికారులకు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం బడా నాయకులకు మేలు జరిగే విధంగా రింగ్ రోడ్డు మ్యాపు మార్చారని ఆరోపించారు. రెడ్డిపల్లిలో మొదటగా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భూములు తీసుకున్నారని, తర్వాత కరెంట్ హైటెన్షన్ వైర్లకు, అనంతరం కొండపోచమ్మ కాలువ కోసం, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు మూలంగా పూర్తిస్థాయిలో భూములు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిబుల్ ఆర్ రోడ్డు కోసం రెడ్డిపల్లి మీదుగా భూసేకరణకు అధికారులు మొదట అలైన్మెంట్ ప్రతిపాదించి గతంలో రెడ్డిపల్లి, పెద్దచింతకుంట మధ్య నుంచి సర్వే చేశారన్నారు. ఇప్పుడు కొంతమంది నాయకుల భూములు కాపాడేందుకు ఆలైన్మెంట్ మార్పు చేసి గ్రామ సమీపం నుంచి సర్వే చేయడం వల్ల రైతులకు నష్టం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా రెడ్డిపల్లికి చెందిన చెరువు సగం పోతుందని, గ్రామానికి చెందిన సుమారు వంద మంది పేద రైతుల బతుకులు రోడ్డు పాలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చేసిన సర్వే ప్రకారం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతులు అధికారులను హెచ్చరించారు. రైతుల ఆందోళనకు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ మద్దతు తెలిపారు.