Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ బోర్డు కార్యదర్శి, ఇంటర్ విద్యాశాఖ కమిషనర్గా పనిచేసిన సయ్యద్ ఒమర్ జలీల్ బాధ్యతలు నిర్వహించిన కాలమంతా చీకటిరోజులని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) విమర్శించింది. ఈ మేరకు టిప్స్ రాష్ట్ర కన్వీనర్ మాచర్ల రామకృష్ణగౌడ్, సమన్వయకర్త ఎం జంగయ్య శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన అవినీతిపరులు, కార్పొరేట్ విద్యాసంస్థలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఉద్యోగులు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారని తెలిపారు. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. మహిళలను వేధించిన వ్యక్తులకు మద్దతుగా నిలిచారని వివరించారు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం విద్యావ్యవస్థను, ప్రభుత్వాన్ని అబాసుపాలు చేశారని తెలిపారు. ఇంటర్ సిలబస్ కుదింపు, 317 జీవో అమలు సరిగ్గా చేయకపోవడం వల్ల అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు కావాల్సిన వివరాలను ప్రభుత్వానికి పంపించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా ఓడీలు, డిప్యూటేషన్లు, అక్రమ బదిలీలు, పదోన్నతులు కల్పించారని తెలిపారు. ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లోనూ రీడిప్లారు పేరుతో అక్రమ బదిలీలు, పదోన్నతులు కల్పించారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, విద్యామంత్రి పి సబితా ఇంద్రారెడ్డి స్పందించి ఇంటర్ బోర్డు, ఇంటర్ విద్యాశాఖ అక్రమాలు, అవినీతిపై ఏసీబీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.