Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్క్‌ఫెడ్ కొనుగోళ్ల కోసం ఎదురుచూపు
- మద్దతు ధర క్వింటాల్ రూ.7,755
- నెలరోజులుగా పంట వస్తున్నా ప్రారంభం కాని కొనుగోళ్లు
- దోచుకుంటున్న వ్యాపారులు.. క్వింటాల్‌కు రూ.3వేల తగ్గింపు
- దిగుబడి లేకున్నా ధరైనా కలిసి వస్తుందని రైతు నిరీక్షణ
- పండుగెళ్లాక ప్రారంభిస్తామంటున్న మార్క్‌ఫెడ్ అధికారులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి కె. శ్రీనివాస్‌రెడ్డి
పప్పుదినుసుల పంట చేతికొచ్చి నెలరోజులవుతున్నా మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభించలేదు.. ఇదే అదనుగా రైతులను వ్యాపారులు దోచుకుంటున్నారు.. పెసల దిగుబడి తగ్గినా.. ధరతోనైనా కలిసి వస్తుందని ఆశిస్తున్న రైతన్నకు ఆశాభంగం కలుగుతోంది. ఎకరానికి 4 క్వింటాళ్ల వరకూ దిగుబడి రావాల్సి ఉండగా అధిక వర్షాలతో క్వింటా పంట కూడా రాలేదు. మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభిస్తే కనీసం మద్దతు ధరైనా లభిస్తుందనే ఆశతో దాదాపు నెలరోజులకు పైగా ఎదురు చూస్తున్నారు. కానీ మార్క్‌ఫెడ్ దసరా పండుగెళ్లాక కొనుగోళ్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమయంలో వ్యాపారులు తక్కువ ధరకు కొనడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది పెసలు క్వింటాల్ రూ.7,755 మద్దతు ధరగా కేంద్రం ప్రకటించింది. కానీ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ రూ.5వేల నుంచి రూ.6వేల వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. గ్రామాల్లో రూ.4వేల నుంచి రూ.5వేల ధర మాత్రమే పెడుతున్నారు. ఒక్కో రైతు క్వింటాకు రూ.3వేలకు పైగా నష్టపోవాల్సి వస్తోంది.
దిగుబడి రాక.. ధర లేక..
ఏటేటా అపరాల పంటల సాగు విస్తీర్ణం పడి పోతోంది. ఈ ఏడాది ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం పెసర సాగు విస్తీర్ణం 25వేల ఎకరాలు కాగా కేవలం 6,869 ఎకరా ల్లోనే పంట సాగు చేశారు. గడిచిన రెండేండ్లలో 20వేల ఎకరాల మేర సాగు చేసినా అధిక వర్షాల తో పంట చేతికందక రైతులు నష్టపోయారు. అరకొరగా వచ్చిన పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. విత్తనాలు విత్తే సమయంలో వర్షాలు అనుకూలంగా కురిసినా పూత, పిందె, కాత, కోత దశలో విపరీతంగా వర్షాలు కురవడంతో పలు చోట్ల పంట దెబ్బతింది.
పంట రాక పెరిగినా కొద్దీ తగ్గిన ధర
దసరా వెళ్లాక మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటికే సగానికి పైగా పంటను రైతులు అమ్ముకున్నారు. ఆగస్టు ద్వితీయార్థం నుంచి పెసల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం మార్కెట్లో ఆగస్టు 16వ తేదీన 25 బస్తాల పెసల అమ్మకాలు జరగ్గా.. క్వింటాల్ గరిష్ట ధర రూ.6,800 చొప్పున నిర్దేశించినా అధిక మొత్తం పంటను రూ.6వేల లోపు కొనుగోలు చేశారు. ఆగస్టు చివరి నాటికి రోజుకు సుమారు 1300 బస్తాలు అమ్మకానికి వచ్చాయి. సరుకు భారీగా రావడం ప్రారంభించే సరికి గరిష్ట ధర క్వింటాల్ రూ.6వేల వరకే పలికింది. సెప్టెంబర్ 15 నాటికి పంట రాక మరింతగా తగ్గింది. రోజుకు 50 నుంచి 150 బస్తాల సరుకు మాత్రమే వచ్చేది. సరుకుతో పాటే ధర కూడా క్షీణించింది. గరిష్ట ధర రూ.6,500 మాత్రమే పలికింది. సెప్టెంబర్ చివరి నాటికి దాదాపు పంట రాక మందగించింది. రోజుకు 120-130 బస్తాలు మాత్రమే అమ్మకానికి వచ్చాయి. సగం పంట అమ్మాక మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.
మార్క్‌ఫెడ్ కొనుగోళ్లతో పాటే కొర్రీలు
మార్క్‌ఫెడ్ కొనుగోళ్లకు గురువారం అనుమతులు వచ్చాయి. ఈ ఏడాది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 481 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. మరోవైపు అరకొరగా ఉన్న పంటను అమ్మేందుకు కూడా మార్క్‌ఫెడ్ సవాలక్ష కొర్రీలు పెట్టే అవకాశం ఉంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో అధిక ధర లభిస్తుందనే ఆశతో గతేడాది జిల్లా రైతులు అనేకమంది అక్కడి మార్కెట్‌కు వెళ్లారు. అక్కడి మార్క్‌ఫెడ్ సిబ్బంది కమీషన్లకు కక్కుర్తి పడి కొనుగోళ్లు చేశారు. కమీషన్ ఇవ్వని రైతుల పంట ధరల విషయంలో కొర్రీలు పెట్టడంతో ఆందోళనకు దిగారు.
మార్క్‌ఫెడ్ నిబంధనలకు లోబడి పంట ఉండటం ఈ ఏడాది దాదాపు అసాధ్యమని రైతులంటున్నారు. తేమ 12శాతానికి లోబడి, పగిలిన పప్పులు 4%, అపరిపక్వ పప్పులు 3%, దెబ్బతిన్న పప్పులు 3- 4%, చెత్తాచెదారం, ఇతరత్ర మిశ్రమాలు 3% లోబడి మాత్రమే ఉండాలని మార్క్‌ఫెడ్ నిబంధనలు విధించింది. ఈ నిబంధనలను ఆధారంగా చేసుకుని కొనుగోళ్లలో అనేక కొర్రీలు పెట్టి విపరీతంగా తరుగు తీస్తారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గిట్టుబాటు ధరిస్తే మేలు
రైతు మోర కోటిరెడ్డి- మేడిదపల్లి- ఖమ్మం
ఈ ఖరీఫ్ సీజన్లో పంట సరిగా పండలేదు. ఎకరానికి క్వింటా దిగుబడి కూడా రాలేదు. మూడెకరాలు సాగు చేస్తే నాలుగు బస్తాల (ఒక్కో బస్తా 80 కేజీలు) దిగుబడి వచ్చింది. ఎకరానికి రూ.15వేల పెట్టుబడి పెడితే మార్క్‌ఫెడ్ ఎటువంటి కొర్రీలు పెట్టకుండా మద్దతు ధర ఇచ్చినా క్వింటాకు రూ.7,755 వస్తాయి. ఇప్పటికీ పంట వచ్చి నెలరోజులకు పైగా అవుతున్నా గిట్టుబాటు ధర రావట్లేదని పంట నిల్వ చేశాను. దిగుబడి రాకున్నా రేటులోనైనా కలిసి వస్తే బాగుంటుంది.
పండుగ తర్వాత కొంటాం
పెండెం సునీత- మార్క్‌ఫెడ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మేనేజర్
సాధారణంగా సెప్టెంబర్ రెండు, మూడు వారాల్లో పెసల దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది ఆగస్టు నుంచే పంట చేతికొచ్చింది. మూడ్రోజుల కిందట పంట కొనుగోళ్లకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. పండుగ వెళ్లాక కొనుగోళ్లు ప్రారంభిస్తాం. మార్క్‌ఫెడ్ నిబంధనల మేరకు కొనుగోళ్లు ఉంటాయి. పంట తక్కువగా ఉంది. లక్ష్యం సాధించడం కష్టమే.