Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన రిజర్వేషన్ పెంపుపై సీపీఐ(ఎం)
- ముఖ్యమంత్రి హామీ నిలబెట్టుకున్నందుకు హర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన రిజర్వేషన్లు పెంచాలని అనేక సంవత్సరాలుగా సీపీఐ(ఎం)తో పాటు, గిరిజనసంఘాలు ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటి ఫలితంగానే గిరిజన రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచుతూ జీవో నంబర్ 33ను ప్రభుత్వం జారీ చేసిందని పేర్కొన్నారు. తక్షణమే దీన్ని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ జీవోను పకడ్బందీగా అమలు జరిగే విధంగా చూడాలని, పోరాటాల సందర్భంగా కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులన్నింటినీ బేషరతుగా ఎత్తివేయాలని తమ్మినేని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమంలో పాలుపంచుకున్న సీపీఐ(ఎం), గిరిజన సంఘాల కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు జేజేలు తెలియజేశారు. ఈ పోరాట స్పూర్తితో మరిన్ని ప్రజా సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి : ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ చైర్మెన్ మిడియం బాబురావు
రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు రిజర్వేషన్లు 10శాతానికి పెంచటాన్ని స్వాగతిస్తున్నామని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ చైర్మెన్ మిడియం బాబురావు తెలిపారు. పెరిగిన జనాభాకనుగుణంగా రిజర్వే షన్లు కల్పించటమనేది రాజ్యాంగ హక్కని చెప్పారు. వాస్తవానికి 2014 నుంచే అమలు కావాల్సిన రిజర్వేషన్లను కేంద్రం తొక్కిపట్టిందని తెలి పారు. ఈ అంశాన్ని వివాదం చేయాలని చూసిందని గుర్తుచేశారు. శాసన సభ తీర్మానమే చేయలేదనీ, మాకు అందలేదని బీజేపీ ప్రభుత్వం చెప్పిందన్నారు. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపటం హర్ష ణీయమన్నారు. అయితే ఈ జీవోను కోర్టులో ప్రశ్నించే అవకాశం ఎక్కు వగా ఉందని చెప్పారు. అటువంటి అనుభవాలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నా యన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో రాష్ట్రపతి, పార్లమెంట్ అమోదిస్తే తప్ప..వీటిని అమలు చేయటం కుదరదన్నారు. రాష్ట్రంలో అన్ని సంఘాలను, పార్టీలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.దీన్ని తొమ్మిదో షెడ్యూల్ చేర్చేలా పోరాడాలని విజ్ఞప్తి చేశారు.
పోరాటాల ఫలితమే 10శాతం రిజర్వేషన్లు :తెలంగాణ గిరిజన సంఘం
రిజర్వేషన్ల పెంపు ఎనిమిదేండ్ల పోరాటాల ఫలితమేనని తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం దర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జీవో 33 జారీపై హర్షం వక్తం చేశారు. తక్షణమే జీవో అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించటం పట్ల వారు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అభినందనలు తెలిపారు. న్యాయస్థానాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా జీవో అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం చట్టబద్ధత కల్పించే విధంగా టీఆర్ఎస్ ఎంపీలు బాధ్యత తీసుకోవాలని కోరారు.