Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకుంటే మునుగోడులో గెలుపు కష్టం
- త్వరలో మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్
- బీజేపీ నేతలతో బన్సల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'మునుగోడు ఉప ఎన్నిక మనకెంతో కీలకం. ఆపరేషన్ ఆకర్ష్‌కు వేగం పెంచండి. లేకుంటే అక్కడ గెలుపు కష్టం. సామాజిక తరగతులు, ప్రజల ఆర్థిక అవసరాలు, స్థానిక ప్రజాప్రతినిధుల లొసుగులు, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు, ఇలా ఏ చిన్న అంశాన్నీ వదిలిపెట్టకుండా అనుకూలంగా మలుచుకోండి. పార్టీలోకి వలసలను ప్రోత్సహించండి' అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునిల్ బన్సల్ ఆ పార్టీ నేతలకు సూచించినట్టు తెలిసింది. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ కార్యవర్గ నేతలతో ఆయన భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్, కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్, వివేక్, గరికపాటి, ఇంద్రసేనారెడ్డి, జితేందర్ రెడ్డి, విజయశాంతి హాజరయ్యారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కరీంనగర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మునుగోడుకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ప్రతి నేత మునుగోడుకు పయనం కావాల్సిందేననీ, ఏడో తేదీన ఆ నియోజకవర్గంలోని 189 గ్రామాల్లో బైక్ యాత్రలకు స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల ఇన్చార్జీలు, ముఖ్య నేతలు హాజరు కావాలని ఆదేశించినట్టు తెలిసింది. నోటిఫికేషన్ త్వరలో వస్తుందనీ, నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఎన్నిక రావొచ్చని నేతలకు తెలిపినట్టు తెలిసింది. ప్రజా గోస-బీజేపీ భరోసా కార్యక్రమం, పార్లమెంట్ ప్రవాస్ యోజన పై సమీక్ష చేపట్టిన బన్సల్ హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికపై చర్చించారు. వరుసగా బీజేపీ స్టీరింగ్ కమిటీ, మండల ఇన్చార్జీలు, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీతో సమీక్ష నిర్వహించిన ఆయన మునుగోడు పరిస్థితులపై అమిత్ షాకు వివరించినట్టు సమాచారం. పదోతేదీన బండి సంజరు అధ్యక్షతన మునుగోడు నియోజకవర్గ బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సమావేశానికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ తరుణ్ చుగ్ సైతం హాజరు కానున్నారు.