Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభించాలి :తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పప్పుధాన్యాలు, నూనె గింజలను కనీస మధ్ధతు ధరలకు మార్క్‌ఫెడ్ కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం కోరింది. ఈఏడాది పప్పుధాన్యాలు 6.5 లక్షల ఎకరాల్లో, నూనెగింజలు 4.48 లక్షల ఎకరాల్లో వేశారని పేర్కొంది. వర్షాల కారణంగాఆ కొంత విస్తీర్ణం తగ్గిందనీ, దీంతో దిగుబడి తగ్గి రైతులకు పెట్టుబడి రానటువంటి పరిస్థితి నెలకొందని ఈ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి సాగర్ పేర్కొన్నారు. ఈమేరకు శనివారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పంటను కొనేందుకు మార్క్‌ఫెడ్ ముందుకు రాకపోవడంతో అన్నదాతకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని పేర్కొన్నారు. క్వింటా పెసర్లను రూ.7,755కు, కందులు రూ.6,600, మొక్కజొన్న రూ.1962, వేరుశనగ రూ.5,850, సోయ రూ.4,300, మినుములు రూ.6,600, నువ్వులు రూ.7,830కు కొనాలని డిమాండ్ చేశారు. పత్తిని సీసీఐ, వరిని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయగా మిగిలిన పంటలను మార్క్‌ఫెడ్ ద్వారా నాఫెడ్ సేకరించాలని కోరారు.
ప్రభుత్వం నిర్ణయించిన మధ్ధతు ధరలకు కొనేందుకు మార్క్‌ఫెడ్ ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. కనీస మద్ధతు ధరలకు కొనుగోలు చేయకపోవడంతో క్వింటాకు రూ.5వేలుకు మధ్యవర్తులు చేస్తూ మోసం చేస్తున్నారని తెలిపారు. జేడీఏలు, మార్కెట్ కార్యదర్శులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రాసెస్ చేసి పప్పుగా మార్చి కిలో రూ.120కి అమ్మి లాభాలు సంపాదిస్తున్నారని చెప్పారు. మధ్య దళారీలు చేస్తున్న దోపిడీని అరికట్టకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను పురమాయించి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే మార్కెట్ల ముందు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.