Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలేజీలతో ముగిసిన విచారణ
- సీబీఐటీ ఫీజు స్వల్పంగా పెంపు
- త్వరలో ప్రభుత్వానికి టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలు
- హైకోర్టుకెళ్లే యోచనలో కొన్ని కళాశాలలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని 173 ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులను తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఖరారు చేసింది. దీంతో సోమవారం అన్ని కాలేజీలతోనూ విచారణ ముగిసింది. అయితే టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజు అమల్లో ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఏ కాలేజీకైనా ఫీజుపై అభ్యంతరం ఉంటే కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఉందనీ, అయినప్పటికీ ఫీజు నిర్ణయించేది మాత్రం తామేనని అంటున్నారు. రాష్ట్రంలో అన్ని ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో జులై నుంచి టీఏఎఫ్ఆర్సీ సంప్రదింపులు జరుపుతున్న విషయం తెలిసిందే. కొన్ని కాలేజీలకు సంబంధించి ఆడిట్ నివేదికల్లో తప్పులు దొర్లినట్టు గుర్తించిన టీఏఎఫ్ఆర్సీ మళ్లీ గతనెల 19 నుంచి 22 వరకు సుమారు 98 కాలేజీల యాజమాన్యాలతో మళ్లీ సంప్రదించి ఫీజులను నిర్ణయించింది. అయినప్పటికీ 20 కాలేజీలు ఆ ఫీజులను అంగీకరించలేదు. దీంతో వాటితో సోమవారం టీఏఎఫ్ఆర్సీ విచారణ జరిపింది. ఇందులో కొన్ని కాలేజీల ఫీజులు గతంలో ఖరారు చేసిన దానికంటే పెరిగినట్టు సమాచారం. ముఖ్యంగా సీబీఐటీ ఫీజు గతంలో రూ.1.12 లక్షలు ఖరారైన విషయం తెలిసిందే. ఇప్పుడు స్వల్పంగా పెరిగినట్టు సమాచారం. టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజులు 2022-23, 2023-24, 2024-25 విద్యాసంవత్సరాల బ్లాక్ పీరియడ్లో అమల్లో ఉంటాయి. ఖరారు చేసిన ఇంజినీరింగ్ ఫీజుల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి టీఏఎఫ్ఆర్సీ త్వరలో పంపించే అవకాశమున్నది. ప్రభుత్వం వాటిని పరిశీలించి ఫీజులకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేస్తుంది. అయితే టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజులను కొన్ని ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు అంగీకరించడం లేదు. ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేశాక హైకోర్టును ఆశ్రయించే అవకాశమున్నట్టు తెలిసింది.
గరిష్ట ఫీజు రూ.1.60 లక్షలు
రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యకు సంబంధించి గరిష్ట ఫీజు ఎంజీఐటీలో రూ.1.60 లక్షలు, కనిష్టఫీజు రూ.35 వేల నుంచి రూ.45 వేలుగా టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసింది. అంటే కనిష్ట ఫీజు రూ.పది వేలు పెంచింది. ఈ బ్లాక్ పీరియెడ్లో సుమారు 25 కాలేజీల్లో రూ.లక్షపైన ఫీజు ఉండే అవకాశమున్నది. అయితే అటు విద్యార్థులపైనే కాకుండా ఇటు ప్రభుత్వంపైనా ఫీజుల భారం పడనుంది. ప్రస్తుతం ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. ఎంసెట్లో పదివేలలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులందరికీ మొత్తం ఫీజును ప్రభుత్వమే భరిస్తుంది.
ఆపైన ర్యాంకు వచ్చిన విద్యార్థులకు గత విద్యాసంవత్సరం వరకు కనీస ఫీజు రూ.35 వేలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఇప్పుడు కనీస ఫీజును టీఏఎఫ్ఆర్సీ రూ.45 వేలకు పెంచాలని ప్రతిపాదించింది. పెరిగిన రూ.10 వేలు ప్రభుత్వం భరించే అవకాశమున్నది. దీంతో ప్రభుత్వంపై ఇది అదనపు భారం కానుంది. ఇంకోవైపు విద్యార్థులపైనా ఫీజు భారం అధికంగా ఉండనుంది. ఉదాహరణకు ఎంసెట్లో పది వేలపైన ర్యాంకు పొందిన ఓ బీసీ లేదా ఓసీ విద్యార్థికి కన్వీనర్ కోటాలో ఎంజీఐటీలో సీటు వస్తే అతనికి ప్రభుత్వం కనీస ఫీజు రూ.45 వేలు మాత్రమే చెల్లిస్తుంది. అంటే మిగిలిన రూ.1.15 లక్షల ఫీజును ఆ విద్యార్థే కట్టాలి. ఇలా విద్యార్థులపై ఈ పెరిగిన ఇంజినీరింగ్ ఫీజులు పెనుభారం కానుంది.