Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లను పరిష్కరించాలనీ, లఖింపూర్ఖేరి దోషులను శిక్షించాలని కోరుతూ మంగళవారం రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను సైతం దహనం చేయాలని సూచించింది. ఈ మేరకు ఎస్కెఎం రాష్ట్ర కమిటీ నాయకులు టి సాగర్, రాయల చంద్రశేఖర్, వల్లపు ఉపేందర్ రెడ్డి, అచ్యుత రామారావు, మండల వెంకన్న, జక్కుల వెంకటయ్య సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో రైతాంగం చేసిన పోరాటానికి కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇచ్చి పదినెలలు గడిచిందని తెలిపారు. దేశంలోనే రైతులు పెద్దఎత్తున ఢిల్లీలో పోరాటం చేశారని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆ పోరాటానికి దిగొచ్చి సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కనీస మద్దతు ధరల అమలు కోసం చట్టాన్ని రూపొందించడానికి ఒక కమిటీని నియమిస్తామంటూ తెలిపిందని వివరించారు. విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంటులో చర్చకు పెట్టేముందు ఎస్కెఎంతో సంప్రదిస్తామనీ, రైతు నాయకులపై పెట్టిన కేసులను ఉపసంహరించు కుంటామని చెప్పిందని తెలిపారు. ఆందోళనా సమయంలో చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామంటూ వాగ్ధానం చేశారని పేర్కొన్నారు. కానీ హామీలు అమలుచేయకపోవడం వల్ల రైతాంగంలో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు.