Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిస్కంల ప్రయివేటీకరణ తాత్కాలికంగా నిలిపేస్తామని హామీ
- ఫలించిన ఎన్సీసీఓఈఈఈ ప్రతినిధి బృందం చర్చలు
- తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటన
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ప్రయివేటీకరణపై ఎట్టకేలకు పుదుచ్చేరి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కేంద్రప్రభుత్వ వత్తిడి వల్లే తాము నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందనీ, దానికి సంబంధించిన ఎలాంటి విధివిధానాలు తమ వద్ద లేవని పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి కుండబద్దలు కొట్టారు. సెప్టెంబర్ 28 నుంచి అక్కడి విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమ్మె రోజురోజుకూ తీవ్రమౌతూ, దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపధ్యంలో నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ (ఎన్సీసీఓఈఈఈ) ప్రతినిధి బృందం సభ్యులు శైలేంద్రదూబే, పీఎన్ చౌదరి, టీ జయంతి, ఎస్ఎస్ సుబ్రహ్మణ్యమ్, పీ రత్నాకరరావు తదితరులు రెండ్రోజులుగా పుదుచ్చేరిలోనే పర్యటిస్తున్నారు.
ఆదివారం రాత్రి విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకుల్ని ఆరెస్టుచేసేందుకు పోలీసులు ప్రయత్నిం చారు. విద్యుత్ ఉద్యోగులు సామూహికంగా ఆ అరెస్టులను అడ్డుకోవడంతో పోలీసులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్సీసీఓఈఈఈ ప్రతినిధి బృందం సోమవారం బ్లాక్ డే పాటించాలంటూ దేశవ్యాప్త పిలుపునిచ్చింది. సమ్మె తీవ్రత పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఎన్సీసీఓఈఈఈ ప్రతినిధి బృందాన్ని చర్చలకు ఆహ్మానించారు. డిస్కంల ప్రయివేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న విధివిధానాలు ఏంటని ప్రతినిధి బృందం ప్రశ్నించింది. దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేకపోయారు. తమ వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేవనీ, కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకే నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. దీన్ని ప్రతినిధి బృందం తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే ప్రయివేటీకరణ ప్రయత్నాలను తాత్కాలికం గా ఉపసంహరించుకుంటున్నట్టు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లు-2022 పార్లమెంటు స్టాండింగ్ కమిటీ పరిశీలనలో ఉన్నందున దీనిపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోరాదని ప్రతినిధి బృందం కోరింది. దీనికి ముఖ్యమంత్రి అంగీకరించినట్టు సమాచారం. దీనితో సమ్మెను తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్టు ఎన్సీసీఓఈఈఈ ప్రతినిధులు తెలిపారు.