Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులపై రవాణా భారం మోపుతున్న కర్మాగారాలు
- ఎఫ్ఆర్పీ నిర్ణయంలో కేంద్రం వివక్ష
- గిట్టుబాటుధర రాక రైతుల ఆందోళన
- డ్రిప్, యంత్ర సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
తీపి పంట సాగు చేసే రైతుల బతుకులు చేదెక్కుతున్నాయి. ఏటేటా చెరుకు సాగు విస్తీర్ణంతో పాటు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ఎఫ్ఆర్పీ నిర్ణయంలో కేంద్రం గిట్టుబాటు ధర ఇవ్వకుండా వివక్ష చూపుతోంది. కర్మాగారాలు రవాణా భారాన్ని రైతులపై మోపుతున్నారు. ఎరువుల ధరల భారం, సాగు ఖర్చులకు సరిపడా ధర కూడా రాని పరిస్థితి నెలకొంది. డ్రిప్, హార్వేస్ట్కు సబ్సిడీ ఇవ్వాలనే రైతుల డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.ఉమ్మడి మెదక్ జిల్లాలో చెరుకు పంట సాగు పెరుగుతోంది. చక్కెర కర్మాగారాల ప్రతినిధులు, అధికారులు చెరుకు సాగును పెంచాలని రైతుల్ని ఒప్పించడంతో ఈ సారి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. సంగారెడ్డిలోని గణపతి, జహీరాబాద్‌లోని ట్రైడెండ్,కామారెడ్డిలోని గాయత్రి చక్కెర కర్మాగారాల క్రషింగ్ సామర్ధ్యాన్ని బట్టి రైతులు చెరుకు సాగు చేస్తున్నారు. 36 వేల ఎకరాల్లో చెరుకు సాగైంది. నవంబర్ మొదటి వారం నుంచి చెరుకు గానుగాడిం చడం మొదలవుతోంది. అక్టోబర్ చివరి వారంలో పంట నరికే పనులు షురూ కానున్నాయి. గణపతి షుగర్స్ పరిధిలో 3600 మంది రైతులు 11,500 ఎకరాల్లో చెరుకు వేశారు. జహీరాబాద్‌లోని ట్రైడెండ్ షుగర్స్ పరిధిలో 7200 మంది రైతులు 19 వేల ఎకరాల్లో నారాయణఖేడ్ ప్రాంతంలో 3 వేల మంది రైతులు 6 వేల ఎకరాల్లో మొత్తం 36 వేల ఎకరాల్లో చెరుకు సాగవగా, 12 లక్షల టన్నులకు పైగా చెరకు ఉత్పత్తి రానుంది. అన్ని చక్కెర కర్మాగారాల్లోనూ గానుగ ఆడించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
టన్ను చెరుకు సాగు ఖర్చు రూ.4వేలపైనే
చెరుకు సాగు పెట్టుబడులు పెరిగాయి. ఎరువులు, విత్తనం, పురుగు మందులు, దున్నకం, లేబర్ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఈ మాట ఏ రైతో రైతు ప్రతినిధులో చెబుతోన్న మాట కాదు. జాతీయ వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ (సీఎసీసీ) కేంద్రానికి ఇచ్చిన నివేదికలో ఇలా పేర్కొంది. టన్ను చెరుకు పండించడానికి రూ.4 వేలకు పైగా ఖర్చు అవుతోందని నివేదిక ఉంది. కనీసం టన్నుకు రూ.3800 ధర చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతోందని తెలిపింది. కానీ..! కేంద్రం ప్రకటించిన ఎఫ్ఆర్పీ ప్రకారం తెలంగాణలోని ఏ ఒక్క కర్మాగారంలో గిట్టుబాటు ధర దక్కట్లేదు. ఎక్కువ చోట్ల రూ.3 వేల లోపే ధర వర్తిస్తుంది.
పెరిగిన పెట్టుబడుల భారం
ఎరువుల ధరలు విపరీతంగా పెరగడంతో ఎకరం చెరుకు సాగుకు రూ.80 వేలపైనే ఖర్చు అవుతోంది. ఎకరాకు డీఏపీ 4 బస్తాలు, యూరియా 4, సూపర్ 4, పొటాస్ 3 బస్తాల చొప్పున వాడుతారు. ఇటీవల డీఎపీ, పొటాష్ ధరలు రూ.1100 నుంచి రూ.1700లకు పెరగడంతో ఎకరాలకు రూ.20 వేలు ఖర్చవుతోంది. చెరుకు విత్తడానికి లేబర్ ఛార్జీలు టన్నుకు రూ.3500 చొప్పున 3 టన్నులకు రూ.10,500, పంట చేతికొచ్చాక నరకడం, రవాణా ఛార్జీలు టన్నుకు రూ.850 చొప్పున 30 టన్నులకు గాను రూ.25,500, దున్నకానికి రూ.10 వేలు, కలుపుతీత, బోదలు పోయడం, మందుల పిచికారి ఇతర ఖర్చులు రూ.15 వేలు చొప్పున మొత్తం కలిపి రూ.80 వేల పెట్టుబడి అవుతోంది. కేంద్రం ప్రకటించిన ఎఫ్ఆర్పీ ప్రకారం సగటు ధర రూ.3 వేలు మాత్రమే ఉంది. ఎకరాకు వచ్చే పంట 30 టన్నులు విక్రయిస్తే రూ.90 వేల ఆదాయమే వస్తోంది. ఇందులో కౌలు ఎకరానికి రూ.10 వేలు పోగా మిగిలేది ఏమీ ఉండదు. అయినా వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో అదే పనిచేస్తున్నామని రైతులు చెబుతున్నారు.
గిట్టుబాటు ధర ఇవ్వని కేంద్రం
2022-23 సంవత్సరం సీజన్‌కు సంబంధించిన ఎఫ్ఆర్పీని టన్నుకు రూ.100 పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర పంటల మాదిరి కాకుండా చెరకుకు వాస్తవిక గిట్టుబాటు ధర (ఎఫ్ఆర్పీ) ''ఫెయిర్ అండ్ రెమ్యూనరేటర్ ప్రైస్'' కేంద్రం ఏటా ప్రకటిస్తోంది. గతేడాదిలో వచ్చిన రికవరీ (చక్కెర శాతం) ఆధారంగా వచ్చే సీజన్‌కు సంబంధించిన ఎఫ్ఆర్పీ ధరను కేంద్రం నిర్ణయించి ప్రకటిస్తోంది. గానుగ సామర్ధ్యం, కర్మాగారం కండీషన్‌ను బట్టి వచ్చే చక్కెర శాతాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు. చక్కెర శాతం ఒక్కో కర్మాగారంలో ఒక్కో రకంగా వస్తోంది.