Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ, ఎస్టీ డాక్టర్లను బలి చేశారు : తెలంగాణ మెడికల్ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనలో ప్రధాన ముద్దాయి రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావేనని అని తెలంగాణ మెడికల్ జేఏసీ ఆరోపించింది. ఈ మేరకు జేఏసీ చైర్మెన్ డాక్టర్ పగిడిపాటి సుధాకర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిజమైన దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. డీపీఎల్ క్యాంపుతో సంబంధం లేని డాక్టర్ శ్రీధర్‌ను సస్పెండ్ చేస్తే హైకోర్టు ఆ చర్యను కొట్టేసిందని గుర్తుచేశారు. అగ్రకులానికి చెందిన రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మికి ప్రమోషన్ ఇచ్చారనీ, షెడ్యూల్డ్ తెగలకు చెందిన డీసీహెచ్ఎస్ డాక్టర్ జాన్సీ లక్ష్మిని స్థాయిని సీహెచ్‌సీకి తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ నాగజ్యోతి సీఎం క్యాంపు కార్యక్రమానికి హాజరు కాకుండా డాక్టర్ గీతకు అప్పగించారని తెలిపారు. షెడ్యూల్డ్ తెగలకు చెందిన సర్జన్ డాక్టర్ జోయల్‌కు ఘటనతో సంబంధం లేకున్నా ఆయనపై క్రిమినల్ కేసు పెట్టారని విమర్శించారు. ఈ నేపథ్యంలో విచారణ నివేదికను బయటపెట్టాలనీ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అధికారులకు న్యాయం జరిపించేందుకు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించనున్నట్టు తెలిపారు.