Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశ్రమల కోసం 2 వేల ఎకరాలు ఇచ్చిన చందనవల్లి రైతులు
- రైతుల పేర్లు చెప్పి.. డబ్బులు కాజేసిన ప్రజాప్రతినిధులు
- న్యాయం చేయాలని 70 రోజులుగా బాధితుల దీక్షలు
- పరిహారం ఇవ్వకపోతే భూములు తిరిగివ్వాలని డిమాండ్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
'పరిశ్రమల పేరు జెప్పి.. ఉద్యోగం, పరిహారం ఆశ జూపితే బువ్వ పెట్టే భూములను ప్రభుత్వానికి ఇచ్చాం.. పరిహారం అందితే ఏదో ఒక్కటి జేసుకుని బతుకుదామని ఆశపడ్డాం. కానీ మా నుంచి ఐదెకరాలు భూమి తీసుకుని ఎకరం భూమికే పైసలు ఇచ్చిండ్రు.. కొందరికి అవి కూడా ఇవ్వలేదు. ఇదిలా ఉంటే మేం సాగు చేసే భూములకు కొందరు ప్రజాప్రతినిధులు తప్పుడు పత్రాలు సృష్టించి, మాకు వచ్చే పరిహారాన్ని వాళ్లే తీసుకుండ్రు.. అటు భూములు పోయి.. ఇటు పరిహారం అందక మేం రోడ్డున పడ్డాం. పరిహారం ఇవ్వాలని అధికారుల చుట్టూ ఏండ్ల తరబడి తిరిగినా పట్టించుకునే నాథుడే లేడు. మా గోడు వినేవారు ఎవ్వరు.. మాకు రావాల్సిన పరిహారం ఇప్పించుండ్రి' అని పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన మూడు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని సుమారు 70 రోజులుగా దీక్షలు చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని తేల్చి చెబుతున్నారు. భూములు కోల్పోయి.. పరిహారం అందక రోడ్డున పడ్డ భూ బాధితులపై 'నవతెలంగాణ' ప్రత్యేక కథనం.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలో పారిశ్రామిక కారిడార్ కోసం మూడు గ్రామాలు చందనవల్లి, హైతబాద్, మంచనపల్లి గ్రామాల్లోని రైతుల నుంచి భూములు సేకరించారు. సర్వే నెంబర్లు 190, 195, 163లలో సుమారు 500 కుటుంబాల నుంచి దాదాపు 2000 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఇందుకు 2013 భూ నిర్వాసితుల చట్టం కింద ఎకరాకు రూ.9 లక్షలు ఇస్తామని రెవెన్యూ అధికారులు రైతులను ఒప్పించారు. కానీ పరిహారం మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు. రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు కుమ్మకై నట్టేటముంచారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఐదెకరాలకు పట్టాదారుగా ఉన్న రైతుకు రెండెకరాలకు పరిహారం ఇచ్చి మీకు గింతే మిగతా భూమి మీ పేరున లేదని దాబాయించారని వాపోయారు. రికార్డుల్లో రైతు పేరు ఉన్నప్పటికీ ఆ భూములకు ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇవ్వడం లేదు. కానీ ఆ భూములతో ఎలాంటి సంబంధం లేని ప్రజాప్రతినిధుల పేరా పత్రాలను సృష్టించి వారికి పరిహారం అందించారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు.
రైతుల సొమ్ము కాజేసిన ప్రజాప్రతినిధులు
బతుకుదెరువు కోసం గ్రామాలు వదిలి పట్టణాలకు వెళ్లిన రైతుల భూములను ప్రజా ప్రతినిధులు తమ పేర రాయించుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వం నుంచి భూ నిర్వాసితులకు అందాల్సిన పరిహారాన్ని కాజేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీల స్థాయి నాయకుల హస్తం ఇందులో ఉన్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. కనీసం ప్రభుత్వ అధికారులు సైతం తమకు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. విసుగెత్తిన బాధితులు పోరుబాట పట్టారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, పెరిగిన ధరలకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని, లేదంటే తమ భూములు తమకు తిరిగి ఇచ్చేయాలని రైతులు కోరుతున్నారు.
ఎకరమే రాసిండ్రు..
మా తాతల నుంచి 3 ఎకరాల భూమి రికార్డుల్లో ఉంది. 2019 వరకు ఈ భూముల్లో పంటలు సాగు చేస్తున్నాం. ప్రభుత్వం కంపెనీలకు భూములు కావాలని బలవంతంగా లాక్కుంది. పైగా 3 ఎకరాల భూమికి ఎకరాకు డబ్బులు ఇచ్చి 2 ఎకరాలు మా పేరా లేదని దబాయిస్తోంది. మూడేండ్లుగా పోరాటం చేస్తున్నాం. ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం మా గోస అర్థం చేసుకుని న్యాయం చేయాలి.
గూడురు ఎల్లయ్యకు నాటి ప్రభుత్వం ఐదెకరాల భూమి అసైన్డ్ చేసింది. ఈ భూమిని 1967 నుంచి ఎల్లయ్య సాగు చేస్తున్నారు. ఎల్లయ్య మరణానంతరం తన కొడుకు గూడురు జంగయ్యకు అనువంశికంగా వచ్చింది. ఆ భూమిని సాగు చేస్తున్న జంగయ్య నుంచి ప్రభుత్వం భూమి తీసుకుంది. పరిహారం కింద ఆయనకు రూ.45లక్షలు రావాలి కానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇదిలా ఉంటే ఐదెకరాలకు పరిహారం ఇచ్చినట్టు అధికారులు లెక్కలు చూపుతున్నారు. బాధితుడికి ఇవ్వకుండా డబ్బులు ఎవ్వరికి ఇచ్చారని అధికారులను ప్రశ్నిస్తే వారి వద్ద ఎలాంటి సమాధానం లేదు. ఇదే పరిస్థితిని జంగయ్యతోపాటు మరో 110 మంది రైతులు ఎదుర్కొంటున్నారు.
వండ్ల భాగ్యమ్మ , బాధితురాలు మాకు న్యాయం చేయాలి
మా భూములకు పరిహారం అందించాలి. మా కుటుంబంలో మా నాన్న పేరున 3 ఎకరాలు, మా పెద్దనాన్న పేరున 3 ఎకరాలు మొత్తం 6 ఎకరాలకు ఉంది. కానీ ఎకరాకు మాత్రమే పరిహారం ఇచ్చారు. మిగతా భూమి మాది కాదంటుండ్రు. రికార్డుల్లో మా పేర్లే ఉన్నవి. పరిహారం మాత్రం వేరేవాళ్లు ఎత్తుకెళ్లారు. రెవెన్యూ అధికారులు మాకు న్యాయం చేయాలి. ప్రభుత్వం మా గోడు పట్టించుకోవాలి.
- నీరటి అంజనేయులు, భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షులు