Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఆర్ఏల కుటుంబాల్లో కనిపించని దసరా శోభ
- పండుగొచ్చినా కొత్తబట్టల్లేవ్
- మూడు నెలలుగా జీతాల్లేక ఇబ్బందులు
- దాతల సహాయంతో నెట్టుకొస్తున్న వైనం
- సర్కారిచ్చిన హామీల అమలు కోసం సమ్మెలో వీఆర్ఏలు
- చర్చలంటూ సాగదీస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోనే పెద్ద పండుగ దసరా. పేదా, ధనికా అనే తారతమ్యం లేకుండా తమ తమ స్తోమతను బట్టి ఇంటిల్లిల్లాది కొత్తబట్టలు కొనుక్కోవడం సాంప్రదాయం. ఆడబిడ్డల హడావిడి షరామామూలే. ఊరంతా పండుగే...కానీ, వీఆర్ఏ కుటుంబాల్లో ఎక్కడా దసరా పండుగ శోభ కనిపించడం లేదు. పండుగకు కొత్తబట్టలు దేవుడెరుగు బుక్కెడు బువ్వ కోసమూ తిప్పలు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఏ రోజుకారోజు దాతలు ఇచ్చే నిత్యావసరాలతో వీఆర్ఏలు తమ కుటుంబాలను నెట్టుకొస్తున్న దైన్యస్థితి. దీంతో లక్షలాది మంది ముఖాల్లో తెలంగాణ పెద్ద పండుగ వచ్చిందనే సంతోషమే లేదు. రాష్ట్రంలో 23,046 మంది వీఆర్ఏ పోస్టులుండగా..ప్రస్తుతం 21,433 మంది విధుల్లో ఉన్నారు. అందులో సగానికిపైగా వృద్ధులే. వారిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ సామాజిక తరగతివారే. అక్కడక్కడా మైనార్టీలు, బీసీలున్నారు. రెండేండ్ల నుంచి సర్కారిచ్చిన హామీలు ఇగ నెరవేరుతాయి...అగ నేరవేరుతాయి...అని కండ్లల్లో ఒత్తులేసుకుని వీఆర్ఏలు చూసీచూసీ విసిగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం వివరాలు సేకరించడం, కొందర్ని పక్కనబెట్టేస్తారనే ప్రచారంతో ఏండ్లతరబడి అత్తెసరు సాలరీతో పనిచేస్తున్న వీఆర్ఏలంతా కలువరపాటుకు గురయ్యారు. అసెంబ్లీ సాక్షిగా హామీనిచ్చిన పేస్కేలు, వారసత్వ ఉద్యోగాలు, ప్రమోషన్ల హామీలను నెరవేర్చాలని అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వం ఇసుమంతైనా కనికరించలేదు. పైగా, వారు అనివార్యంగా సమ్మెలోకి వెళ్లేలా చేసింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చర్చల పేరుతో నచ్చజెప్పి పంపించేసింది. అయినా, వారు ఎక్కడా గొడవ చేయలేదు. శాంతియుత వాతావరణంలో తమ సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వమేమో అదిగో చర్చలు..ఇదిగో చర్చలు అంటూ నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్నది. సమ్మెలో ఉన్నారనే కారణంలో వచ్చే రూ.10,500 వేతనాన్ని కూడా మూడు నెలల నుంచి ఆపేయించింది. భేషజాలకు పోతున్నది. దీంతో వీఆర్ఏలు తమ కుటుంబ పోషణ కోసం అప్పులుచేసి వెళ్లదీస్తున్న ధీన పరిస్థితి నెలకొంది. కనీసం తమ పిల్లలకు జ్వరాలు వచ్చినా ఆస్పత్రుల్లో చూపించుకునే పరిస్థితిల్లో వారు లేరు. ఎందుకంటే వారి అత్యంత పేద కుటుంబాలు. మంచిర్యాల జిల్లా జెన్నారం మండలానికి చెందిన ఓ వీఆర్ఏ బిడ్డకు జ్వరం వచ్చింది. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో మామూలు మెడిసిన్ వేశారు. ఎంతకీ తగ్గకపోవడంతో చివరకు అప్పుచేసి టెస్టులు చేయించగా అది డెంగ్యూ ఫీవర్ అని తేలింది. ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోయి చనిపోయింది. కేవలం చేతుల్లో డబ్బులు లేకపోవడం వల్లనే ఆ పాప చనిపోయింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన మరో వీఆర్ఏ కూడా తన భార్యను కోల్పోయాడు. ఆమె గర్భవతి. అదే సమయంలో డెంగ్యూ జ్వరం వచ్చింది. డబ్బులేకపోవడంతో కొంత తాత్సారం జరిగింది. కొద్ది రోజుల్లోనే పరిస్థితి విషమించి చనిపోయింది. ఈ రెండు ఉదహరణలు వీఆర్ఏ కుటుంబాలు పడుతున్న దీనావస్థలకు ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ కాలంలో 60 మందికిపైగా వీఆర్ఏలు మరణించారు. వారిలో నలుగురైదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీఆర్ఏలంతా 73 రోజులుగా సమ్మెలో ఉన్నారు. జీతాల్లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు వీఆర్ఏలైతే దీక్షా శిబిరాల్లో తమ కుటుంబ పరిస్థితులను చెప్పుకుంటూ బోరున విలపిస్తున్నతీరు చూసేవారికీ కన్నీటిని తెప్పిస్తున్నది. వీఆర్ఏల బాధలను చూసి ఆయా మండల కేంద్రాల్లో స్వచ్ఛంధ సంస్థలు నిత్యావసరాలను అందజేస్తున్నాయి. వాటితోనే ఏరోజుకారోజు ఆ కుటుంబాలు నెట్టుకొస్తున్నాయి. రెవెన్యూ వ్యవస్థలోని కిందిస్థాయి ఉద్యోగులు, తహసీల్దార్లు, ఎమ్మెల్యేలు కూడా తమకు తోచినంత సహాయం అందజేస్తున్నారు. ఇలా దాతల సహాయంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా కుటుంబాలు దసరా పండుగను చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. లక్ష మంది పండుగకు దూరంగా ఉండనున్నారు. 'మేమేం పాపం చేశాం. మాపై ఎందుకింత కోపం? సీఎం మంచి చేస్తారనే చిన్న ఆశతోనే బతుకుతున్నాం. దసరా పండుగ కానుకగా మాకు పేస్కేలు జీవో, వారసత్వ ఉద్యోగాలు, ప్రమోషన్ల జీవోలు ఇస్తే అదే మాకు పదివేలు' అని వీఆర్లు వేడుకుంటున్నారు.