Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గులాబీ పార్టీలో కీలక ఘట్టం
- జనరల్ బాడీలో నిర్ణయించనున్న సీఎం కేసీఆర్
- మద్దతు పలికేందుకు విచ్చేసిన కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, ఇతరులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దసరా పండుగ రోజైన బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. 2018లో ముందస్తు ఎన్నికల సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చిన ఆయన... తాజాగా బీఆర్ఎస్ అంటూ ముందుకొస్తున్నారు. ఇప్పటిదాకా ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని... ఆయన బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా మార్చబోతున్నారు. తద్వారా జాతీయ పార్టీగా దాన్ని రూపాంతరం చెందించబోతున్నారు. సంబంధిత వార్తలు గత కొన్ని నెలలుగా మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్న సంగతి విదితమే. అయితే ఇప్పుడు అందుకనుగుణంగా పరిణామాలు వేగం పుంజుకున్నాయి. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు నిర్వహించబోయే టీఆర్ఎస్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం (జనరల్ బాడీ)లో జాతీయ పార్టీపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మధ్యాహ్నం 1.19 గంటలకు ఇది వెలువడే అవకాశముందంటూ టీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. విస్తృతస్థాయి సమావేశానికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతోపాటు జిల్లా పరిషత్, కార్పొరేషన్ల చైర్మెన్లు హాజరు కావాలంటూ సీఎం ఆదేశించారు. మరోవైపు కేసీఆర్ ప్రయత్నాలకు మద్దతునిచ్చేందుకోసం కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి మంగళవారం రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకున్నారు. ఆయన వెంట మాజీ మంత్రి రేవన్న కూడా ఉన్నారు. రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు... వారికి బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. తమిళనాడుకు చెందిన దళిత ఉద్యమ పార్టీ విడుదలై చిరుత్తయిగల్ కచ్చి ఎంపీ తిరుమవలవన్ కూడా కేసీఆర్కు మద్దతునిచ్చేందుకు హైదరాబాద్కు వచ్చారు. వీటితోపాటు మరో మూడు పార్టీలు కూడా బీఆర్ఎస్కు మద్దతునివ్వనున్నాయనీ, కొన్ని పార్టీలు అందులో విలీనమవుతాయని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. జనరల్ బాడీ సమావేశానంతరం నిర్వహించబోయే మీడియా సమావేశంలో కేసీఆరే స్వయంగా జాతీయ పార్టీపై ప్రకటన చేయనున్నారని సమాచారం. మరోవైపు బీఆర్ఎస్పై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీని పలువురు స్వాగతిస్తుండగా... మరికొందరు పెదవి విరుస్తున్నారు. గతంలో ఫెడరల్ ఫ్రంట్ అనే దాన్ని ముందుకు తెచ్చిన కేసీఆర్... అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాని ప్రస్తావనే తీసుకురాలేదని వారు గుర్తు చేస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో ఆయన ఏ విధంగా సయోధ్య నెరుపుతారు..? వాటిని కలుపుకుని బీజేపీపై ఏ విధంగా పోరాటం నిర్వహిస్తారనే దానిపైన్నే బీఆర్ఎస్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నాటి టీఆర్ఎస్ జనరల్ బాడీపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
మనుగోడు అభ్యర్థిగా కూసుకుంట్లే...?
మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ తరపున తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డినే బరిలోకి దించాలని సీఎం నిర్ణయించారు. ఈసారి బీసీలకు టిక్కెటివ్వాలనే వాదన బలంగా వినిపించినప్పటికీ కూసుకుంట్ల వైపే కేసీఆర్ మొగ్గు చూపారని తెలిసింది. ఆయన అభ్యర్ధిత్వాన్ని ఇప్పటికే ఖరారు చేసిన సీఎం... సంబంధిత నిర్ణయాన్ని కూడా బుధవారమే ప్రకటించనున్నారని తెలంగాణ భవన్ వర్గాలు తెలిపాయి.