Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటిరోజు ప్రదర్శన, బహిరంగసభ
- నేతలు రమ, చండ్ర అరుణ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్ర ఏడో మహాసభలు ఈనెల ఎనిమిది, తొమ్మిది తేదీల్లో నారాయణపేటలో జరగనున్నాయి. మొదటిరోజైన ఎనిమిదిన అక్కడి మెట్రో ఫంక్షన్‌హాల్ నుంచి ప్రదర్శన అనంతరం సత్యనారాయణ చౌరస్తా వద్ద బహిరంగసభ నిర్వహిస్తారు. మంగళవారం హైదరాబాద్‌లోని మార్క్స్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు కె రమ, ప్రధాన కార్యదర్శి చండ్ర అరుణ మాట్లాడుతూ బహిరంగసభకు ముఖ్యఅతిధిగా సామాజిక విశ్లేషకులు దేవి, వక్తలుగా ఆహ్వాన సంఘం అధ్యక్షులు పి నారాయణమ్మ, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర నాయకులు ఎం కృష్ణ హాజరవుతారని చెప్పారు. ఈనెల తొమ్మిదిన మహాసభలో సీసీఎంబీ శాస్త్రవేత్త చందన చక్రవర్తి ప్రారంభోపన్యాసం చేస్తారని వివరించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భేటీ పడావో... భేటీ బచావో అనేది కేవలం నినాదంగా మారిపోయిందని అన్నారు. దేశంలో మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు. నిత్యం వారిపై లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పబ్‌లు, మద్యం అమ్మకాల ద్వారా లైంగికదాడులు పెరుగుతున్నాయనీ, ఎన్కౌంటర్ల ద్వారా అవి ఆగబోవని అన్నారు. గృహహింస, నిర్భయ, దిశ, పోక్సో చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అశ్లీల సినిమాలను నిషేధించాలని కోరారు. మోడీ ప్రభుత్వం మనువాదాన్ని ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం షీటీంలను పెట్టినా మహిళలపై దాడులు ఆగడం లేదన్నారు. వారికి కావాల్సింది బతుకమ్మ చీరలు కాదనీ, భద్రత, ఉపాధి అవకాశాలను ఏర్పాటు చేయాలని సూచించారు. స్త్రీ, పురుషులకు సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర నాయకులు డి స్వరూప, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయకులు దేవమని, ఎం పుష్ప తదితరులు పాల్గొన్నారు.