Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 మందిలోపు అడ్మిషన్లుంటే సీట్లు, కోర్సులు ఫ్రీజ్
- లక్ష వరకు సీట్లు రద్దయ్యే ప్రమాదం
- కాలేజీయేట్ కమిషనరేట్, ఉన్నత విద్యామండలి నిర్ణయం
- ఉపసంహరించాలంటున్న ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలపై ప్రభుత్వం కత్తికట్టింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో జీరో అడ్మిషన్లు, 15 మందిలోపు విద్యార్థులు చేరిన కోర్సులు, సీట్లను ఫ్రీజ్ చేయాలని కాలేజీయేట్ కమిషనరేట్, ఉన్నత విద్యామండలి నిర్ణయించాయి. దీనివల్ల సుమారు 900 డిగ్రీ కాలేజీల్లో లక్ష వరకు సీట్లు రద్దయ్యే ప్రమాదమున్నది. దీంతో ప్రయివేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరం వరకు పాత విధానాన్ని కొనసాగించాలనీ, కాలేజీయేట్ కమిషనరేట్, ఉన్నత విద్యామండలి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. అయితే రాష్ట్రంలో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత విద్యాసంవత్సరంలో మూడు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇప్పటి వరకు 1.53 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశం పొందారు. రాష్ట్రంలో 978 ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో 4.20 లక్షల సీట్లున్నాయి. వాటిలో దోస్త్ ద్వారా ఏటా 2.25 లక్షల నుంచి 2.50 లక్షల వరకు నిండుతున్నాయి. అంటే సుమారు రెండు లక్షల సీట్ల వరకు మిగులుతున్నాయి. అందుకే విద్యార్థులు చేరని సీట్లు, కోర్సులను మూడేండ్లు పరిశీలించి రద్దు చేస్తామంటూ అధికారులు చెప్తూనే ఉన్నారు. ఆ నిర్ణయం ఈ విద్యాసంవత్సరంలో కార్యరూపం దాల్చడం గమనార్హం. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల ఒకటి నుంచి దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతున్నది. ఏడో తేదీ వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేసేందుకు అవకాశమున్నది. తొమ్మిదిన సీట్లు కేటాయిస్తారు. అయితే ఇప్పటి వరకు నిర్వహించిన మూడు విడత ప్రవేశాలను పరిశీలించిన కాలేజీయేట్ కమిషనరేట్, ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నాయి. జీరో అడ్మిషన్లు, 15 మంది విద్యార్థుల్లోపు చేరిన కోర్సులు, సీట్లను ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఫ్రీజ్ చేయాలని ప్రకటించాయి. అంటే ఆయా కోర్సులు, సీట్లలో ప్రత్యేక విడత ద్వారా వెబ్ఆప్షన్లు నమోదు చేసేందుకు విద్యార్థులకు అవకాశముండదు. అంటే ఆయా కోర్సులు, కాలేజీల్లో ప్రవేశాల్లేకుండా అధికారులు ఆంక్షలు విధించారు.
కాలేజీల కోసమే ఈ నిర్ణయం : లింబాద్రి
విద్యార్థులు చేరని కోర్సులు, సీట్లనే ఫ్రీజ్ చేస్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి చెప్పారు. ఈ నిర్ణయం కాలేజీల మేలు కోసమేనని అన్నారు. తక్కువ మంది విద్యార్థులతో కోర్సులను నడపడం కాలేజీలకు భారమని వివరించారు. ఇంకోవైపు తక్కువ మంది విద్యార్థులకు అధ్యాపకులను నియమించకపోయినా, నాణ్యమైన విద్య అందకపోయినా వారు నష్టపోతారని చెప్పారు. మరోవైపు మూడేండ్లలో జీరో అడ్మిషన్లు, 15 మందిలోపు విద్యార్థులు చేరిన కోర్సులు, సీట్లనే ఫ్రీజ్ చేస్తున్నామని వివరించారు. ఒకవేళ వచ్చే విద్యాసంవత్సరంలో ఆ కోర్సులను పునరుద్ధరిస్తామన్నా, కన్వర్షన్ చేస్తామన్నా ఆయా కాలేజీలకు అవకాశం కల్పిస్తామన్నారు. కన్వర్షన్ ఫీజు లేకుండానే ఈ ప్రక్రియ చేపట్టేందుకు కృషి చేస్తామని అన్నారు.
ఉన్నత విద్యామండలిని ముట్టడిస్తాం : గౌరి సతీశ్
దోస్త్ కౌన్సెలింగ్ ముగియకుండానే జీరో అడ్మిషన్లతోపాటు 15 మందిలోపు చేరిన కోర్సులు, సీట్లను రద్దు చేస్తామనడం సరైంది కాదని కేజీ టు పీజీ విద్యాసంస్థల జేఏసీ కన్వీనర్ గౌరి సతీశ్ తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలనీ, లేదంటే ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. గత విద్యాసంవత్సరంలో ఉన్న విధానాన్నే కొనసాగించాలని కోరారు. కాలేజీలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రత్యేక విడతలో ఆయా కోర్సులు, సీట్లకు వెబ్ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, కాలేజీలు నష్టపోకుండా చూడాలని కోరారు.