Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభానికి నోచుకోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
- ఊరుకి దూరమంటూ అప్పుడు సాకు
- దానికి కూతవేటుదూరంలోనే నేడు తాత్కాలిక నివాసం ఏర్పాటు
- ప్రజల కోసమే రాజీనామా ఒట్టిదే... బీజేపీ చేతిలో పావే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమ సమస్యలను ఎమ్మెల్యేకు మొరపెట్టుకోవడానికీ, ప్రతి చిన్న విషయానికీ హైదరాబాద్కు ప్రజలు రాలేరు. తమ సాధకబాధకాలను చెప్పుకోవడానికి నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయమే దిక్కు. ఆ సమస్య పరిష్కారం అవుతుందా? లేదా? అనేది పక్కనబెడితే క్యాంపు కార్యాలయానికెళ్లి ఎమ్మెల్యే దృష్టికి తమ సమస్య తీసుకెళ్లామనే ఒక ఊరట పొందుతారు. నమ్మకంతో గెలిపించిన ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను, ఇచ్చిన వినతిపత్రాలను ఫైలింగ్ చేసి రాష్ట్ర సర్కారు దృష్టికి తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేది. ప్రభుత్వం నిధులిస్తుందా? లేదా అనేది తర్వాతి విషయం. ఒకవేళ ఇవ్వకపోతే అవన్నీ చూపెట్టి ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచాను కాబట్టి నిధులివ్వట్లేదు...అభివృద్ధి చేయట్లేదు అని రాజీనామాకు వెళ్తే ప్రజలు నిజంగానే నమ్మేవారు. కానీ, మునుగోడు నియోజకవర్గంలో ఈ ప్రక్రియేదీ మూడున్నరేండ్లుగా సాగలేదు. ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఒక్కనాడు కూడా క్యాంపు కార్యాలయంలో అడుగుపెట్టలే. ప్రజా సమస్యలు వినలే. ఆయన నియోజకవర్గంలో తిరిగింది అంతంతేనన్న విమర్శకూడా ఉన్నది. ఆశ్చర్యకర విషయమేమిటంటే ఆ కార్యాలయాన్ని నేటికీ ప్రారంభించలేదు. దాన్ని వాడుకుంటే బాగుటుందనే కాంగ్రెస్ శ్రేణుల సూచనను ఏనాడూ పట్టించుకోలేదు. పైగా, ఊరవతల ఉందని సాకుగా చూపెట్టారు. దీంతో ప్రజా సమస్యలను వినేందుకు వేదిక కావాల్సిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మందుబాబులకు అడ్డాగా మారింది. ఇప్పుడు అదే కార్యాలయానికి కూత వేటు దూరంలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల ప్రచారానికి ఇబ్బంది అవుతుందనే దృష్టితో తాత్కాలికంగా రెడీమెడ్ మెటీరియల్తో నిర్మించారు. ప్రచార కార్యకలాపాలకు అడ్డా కోసం పెట్టిన అది ఎన్నికలు అయిపోయాక ఉంటుందా? లేపుకెళ్తారా? అనేదీ ప్రశ్నార్థకమే. ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడకు రావొచ్చని చెబుతున్న రాజగోపాల్రెడ్డి.. ఇప్పుడది ఊరికి దూరంగా లేదా? ఇబ్బంది కాదా? అనేది చెప్పాలి. దీనినిబట్టే ప్రజా సమస్యల పరిష్కారం, మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేశాననేది ఒట్టిమాటేన న్నది ఈ ఒక్క విషయం ద్వారానే అర్ధమవుతున్నది. సొంతనిధులతో అభివృద్ధి అనేదీ ఒట్టిమాటేనన్నది తేలింది. ఉత్తరాదిలో వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలో ఆర్థిక వనరులు పరిపుష్టంగా ఉన్న నేతలతో ఇక్కడ పాగా వేయాలనే బీజేపీ ఎత్తుగడలో రాజగోపా ల్రెడ్డి పావుగా మారా రనేది స్పష్టమవుతున్నది. అందులో నుంచి పుట్టుకొచ్చినదే మునుగో డు ఉప ఎన్నిక అన్నది స్పష్టం.