Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లఖింపూర్‌ఖేరీ ఘటన కారకులను కఠినంగా శిక్షించాలి
- రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
లఖింపూర్‌ఖేరి ఘటనకు బాధ్యులైన కేంద్ర మంత్రి అజయ్‌కుమార్ మిశ్రాను క్యాబినెట్ నుంచి తొలగించాలనీ, నలుగురు రైతులు, జర్నలిస్టు ప్రాణాలు పొట్టనబెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన వద్ద సంయుక్త కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ గతేడాది అక్టోబర్ మూడో తేదీన లఖీంపూర్‌ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతులపైకి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా రైతులపైకి కారు ఎక్కించడంతో నలుగురు రైతులు, జర్నలిస్టు చనిపోయారని గుర్తుచేశారు. నేటికీ బాధిత రైతు కుటుంబాలకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పటిలాగానే నేరస్తులకు కొమ్ము కాస్తున్నదని విమర్శించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేదాకా రైతుల పోరు కొనసాగుతుందని నొక్కి చెప్పారు. రైతులకు మేలు చేసేందుకుగానూ కనీస మద్దతు ధరల చట్టం తేవాలనీ, విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, లెల్లెల బాలకృష్ణ, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మూర్తి, నాగరాజు, నాయకులు విజయ్ కుమార్, అశోక్ రెడ్డి, గణేష్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.