Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రిబ్యునల్‌కు రాష్ట్రానికి మధ్య ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉంది
- స్వచ్ఛ అవార్డులు సాధించిన పురపాలికలకు రూ.2 కోట్ల నిధులు : పురపాలకశాఖ
మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వ్యర్థాల నిర్వహణ తీర్పుల అమలుపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తామనీ, అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పారిశుధ్య నిర్వహణ కార్యక్రమలపై మరింత సమగ్ర సమాచారాన్ని అందిస్తామని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ట్రిబ్యునల్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొంత సమాచార గ్యాప్ ఉన్నదనీ, దాన్ని అధిగమించేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు సాధించిన 19 మున్సిపాలిటీలకు ఒక్కో దానికి రూ. 2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ నిధులను ప్రత్యేకంగా పారిశుధ్యం కోసమే వినియోగించాలని కోరారు. మంగళవారంనాడిక్కడి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు సాధించిన మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, కమిషనర్ల అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడంగ్పేట్, కోరుట్ల, సిరిసిల్ల, తుర్కయాంజాల్, గజ్వేల్, వేములవాడ, ఘట్కేసర్, కొంపల్లి, హుస్నాబాద్, ఆదిభట్ల, కొత్తపల్లి, చండూర్, నేరేడుచర్ల, చిట్యాల, భూత్పూర్, అలంపూర్, పీర్జాదిగూడ, కోరుట్ల మున్సిపాల్టీలకు చెందిన చైర్పర్సన్లు, కమిషనర్లను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిందన్నారు. పురపాలికల్లో పారిశుద్ధ్య కార్మికురాలి నుంచి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వరకు అందరిదీ ఒకే రకమైన ఆలోచనా విధానంతో పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైందని ప్రసంసించారు. రాష్ట్రంలోని అభివృద్ధి పనులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయనీ, దీనికి కేంద్ర ప్రభుత్వ విభాగాలు ఇస్తున్న అవార్డులే ప్రత్యక్ష సాక్ష్యమని అన్నారు. అదే సందర్భంలో ఇక్కడేం అభివృద్ధి లేదంటూ అదే కేంద్రంలోని కొందరు వ్యక్తులు విమర్శలు చేస్తుంటారనీ, అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మనం ఏం చేస్తున్నామో ప్రజల కండ్ల ముందు ఉంది. వారే నిర్ణేతలుగా ఉంటారని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా అత్యుత్తమమైన రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వ అవార్డులే సమాధానం చెప్తున్నాయన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు సాధించిన 19 పురపాలికల పాలక మండళ్లు, అధికారులను జపాన్, సింగపూర్ దేశాలకు స్టడీ టూర్‌కు పంపిస్తామన్నారు. అక్కడి ఉత్తమమైన సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణను అధ్యయనం చేసి రావాలని కోరారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ వల్ల అద్భుత ఫలితాలు వస్తున్నాయన్నారు. అనేకమంది మహిళలు పురపాలికలకు నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. పట్టణాభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేసే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నదని చెప్పారు. ఇప్పటికే పలుచోట్ల దీన్ని అమల్లోకి తెచ్చామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా స్థానిక సంస్థల కోసం అదనపు కలెక్టర్ వ్యవస్థ కేవలం తెలంగాణలోనే ఉన్నదని వివరించారు. అన్ని పురపాలికల్లో పది పాయింట్ల కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తామన్నారు. వెజ్ అండ్ నాన్ వెజ్ మోడల్ మార్కెట్లు, వైకుంఠధామం, డంప్ యార్డ్ల బయో మైనింగ్, మాస్టర్ ప్లాన్, మోడర్న్ దోభీఘాట్, టీఎస్‌బీపాస్, మానవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు, గ్రీన్ బడ్జెట్ వంటి 10 లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, ఎమ్ఏయూడీ కమిషనర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.