Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రెనైడ్లు వేసి భారీ ఎత్తున ప్రాణ నష్టానికి కుట్ర
- పట్టుబడ్డ ముగ్గురు ఉగ్రవాదుల రిమాండ్ రిపోర్ట్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
రాష్ట్రంలో భారీ ఎత్తున పేలుళ్లు జరిపి ప్రాణ నష్టానికి కుట్రపన్నిన ఉగ్రవాదులు దసరా రోజు రావణ దహనాలు జరిగే ప్రాంతాలను టార్గెట్ చేసినట్టు దర్యాప్తు అధికారుల విచారణలో తేలింది. రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లో ముగ్గురు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జాహేద్, షిమియోదీ ్దన్, మాజ్ హసన్‌ల విచారణలో అనేక కుట్రలు బయట పడ్డాయి. వీరికి గురువుగా మారిన పాకిస్థాన్‌లోని ఫర్హతుల్లానే ఈ బాంబు పేలుళ్లకు మార్గ నిర్దేశనం చేసినట్టు విచారణలో తేలిందని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఫర్హతుల్లా ద్వారా పాకిస్థాన్ నుంచి నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు ఈ ముగ్గురు ఉగ్రవాదులకు అందాయి. ముఖ్యంగా, ''పాకిస్థాన్ బోర్డర్ నుంచి భారత సరిహద్దుల్లోకి డ్రోన్ల ద్వారా ఈ గ్రెనేడ్లను చేరవేశారు. అక్కడి నుంచి ఉగ్రవాద హ్యాండ్లర్ వీటిని కొరియర్లకు చేరవేశారు. కాశ్మీర్ సరిహద్దు నుంచి మహారాష్ట్రలోనికి కొరియర్ల ద్వారా ఈ బాంబులు చేరాయి. అక్కడి నుంచి జాహేద్ హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు ద్విచక్ర వాహనం మీద వెళ్లి బాంబులను తీసుకొచ్చాడు'' అని విచారణలో తేలింది. అంతేగాక, ఈ బాంబులను దసరా రోజు నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే రావణ దహన ఉత్సవాల్లో భారీ ఎత్తున జనం హాజరవుతారనీ, ఆ సమయంలో వారిపై హ్యాండ్ గ్రైనెడ్స్ వేయడం ద్వారా భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగే ఆస్కారం ఉందనీ ఫర్హతుల్లా.. జాహేద్కు, షమియోద్దీన్, మాజ్ హసన్‌లకు దిశా నిర్దేశం చేసినట్టు బయట పడింది. ఒకవేళ మీరు పోలీసులకు చిక్కితే వారి పైనా హ్యాండ్ గ్రెనెడ్స్ వేసి తప్పించుకోవాలని సూచించినట్టు విచారణలో వెలుగు చూసింది. దీంతో ఈ ముగ్గురు ఉగ్రవాదులు తమ ప్లాన్ అమలు చేసే ముందు కూడా హ్యాండ్ గ్రెనేడ్లను దగ్గర ఉంచుకొని పడుకోవాలనీ, పోలీసులు దాడి చేస్తే వారి పైన వేసి పారిపోవాలని కూడా ఫర్హతుల్లా సూచించినట్టు విచారణలో తేలినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.