Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు హామీ
- ఆందోళన విరమించిన డాక్టర్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో అర్హత లేని వైద్యులను గుర్తించేందుకు వీలుగా నెల రోజుల్లో అన్ని జిల్లాల్లో యాంటీ క్వాకరీ (నకిలీ వ్యతిరేక) కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. నకిలీ డాక్టర్లను అరికట్టాలనే డిమాండ్‌పై ఆందోళన చేపట్టిన వైద్య సంఘాల నాయకులతో ఆయన సమావేశమై చర్చించారు. ఈ కమిటీలు తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్టం, నేషనల్ మెడికల్ కౌన్సిల్ చట్టంలోని నిబంధనల ప్రకారం అర్హత లేకుండా ఆధునిక వైద్యం చేస్తున్న వారితో పాటు, నకిలీ వైద్యులను ప్రోత్సహించే వారిపై కూడా చర్యలు తీసుకుంటాయని తెలిపారు. అనుమతి లేని , అనర్హులతో ఉన్న ఆస్పత్రిలన్నింటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో దాదాపు 15 రోజుల పాటు దశల వారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన డాక్టర్ల సంఘాలు తమ ఉద్యమాన్ని నెల రోజుల పాటు వాయిదా వేశాయి. ఈ మేరకు నాయకులు ప్రకటన విడుదల చేశారు.
సిబ్బంది కొరతను తీర్చాలి..
ఈ సందర్భంగా హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ ఆర్ డీఏ) నాయకులు మంత్రికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్నిసమర్పించారు. అనర్హుల క్లినిక్‌లను మూసి వేసేందుకు వీలుగా అందుబాటులో ఉన్న ఆశా, అంగన్ వాడీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఏఎన్ఎం, ఎంఎల్ హెచ్ పీలను ప్రథమ చికిత్స అందించేందుకు ప్రోత్సహించాలని కోరారు. 2021 గ్రామీణ ఆరోగ్య గణాంకాల ప్రకారం...ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 12 శాతం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 53 శాతం సిబ్బంది కొరత ఉందని తెలిపారు. గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు వీలుగా ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 2013 ఆగస్టు ఎనిమిదిన విడుదల చేసిన జీవో 129ను అమలు చ్ఱేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ)లో ఎవరు జోక్యం చేసుకోవడానికి వీల్లేకుండా స్వతంత్ర యాంటీ క్వాకరీ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరముందని సూచించారు. ఆస్పత్రుల ఏర్పాటులో చిక్కులను తొలగించేందు కోసం ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్‌తో పాటు, రెన్యూవల్ జారీకి నిర్దిష్ట సమయాన్ని విధిస్తే సమస్యను అధిగమించవచ్చని తెలిపారు. ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీం అనుమతి, రెన్యూవల్ కోసం నిర్దిష్ట సమయం ఉండాలని సూచించారు. నియామకాలకు క్యాలెండర్ ఇయర్‌ను ప్రకటించాలనీ, ఉస్మానియాకు, టీఎస్ఎంసీకి కొత్త భవనాన్ని నిర్మించాలని కోరారు. మంత్రితో చర్చించిన వారిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంపత్ కుమార్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బీ.ఎన్.రావు, టీఎస్ఎంసీ చైర్మెన్ డాక్టర్ రాజలింగం, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణారెడ్డి, సభ్యులు డాక్టర్ లింగమూర్తి, హెచ్ఆర్డీఏ అధ్యక్షులు డాక్టర్ కె.మహేశ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు డాక్టర్ తోట కిరణ్, టీడీఎఫ్ అధ్యక్షులు డాక్టర్ అన్వేష్, టీఎస్ఆర్డీఏ అధ్యక్షులు డాక్టర్ ఎం.రాజీవ్, టీజూడా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వన్యా జాస్మీన్ ఉన్నారు.