Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ పేరు మార్పును ప్రకటించిన సీఎం కేసీఆర్
- జాతీయ రాజకీయాలపై దృష్టి
- మహారాష్ట్ర నుంచే మొదలు...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారింది. ఈ మేరకు ఆపార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటన చేశారు. బుధవారం దసరా పండుగ రోజు ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. పేరు మార్పును ప్రతిపాదనకు సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చదివి వినిపించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బృందం గురువారం ఢిల్లీకి వెళ్లి, కేంద్ర ఎన్నికల సంఘానికి తీర్మానం కాపీ అందచేశారు. పేరు మార్పు కార్యక్రమానికి ప్రత్యేక అతిధులుగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, అక్కడి ప్రతిపక్ష పార్టీ జనతాదళ్ (ఎస్) ముఖ్యనేత హెచ్డీ కుమారస్వామి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, తమిళ నాడు నుంచి 'విదుతాలై చిరుతైగల్ కట్చె' (వీసీకే)పార్టీ అధినేత, చిదంబరం నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడు, దళిత నేత తిరుమావళవన్‌తో పాటు ఆపార్టీ ప్రతినిధుల బందం హాజరయ్యింది. వీరికి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆహ్వానం పలికారు. పేరుమార్పు కార్యక్రమం అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆపార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి. కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు సహా అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ 21 ఏండ్ల క్రితం జలదృశ్యంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో మొదలైన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షల నుంచి నేటి వరకు జరిగిన రాజకీయ పరిణామాలను వివరించారు. స్వరాష్ట్రాన్ని సాధించుకొని, స్వీయ పాలనలో అన్ని రంగాలను అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ పాలన దేశానికి రోల్ మోడల్‌గా నిలవాలనే ఉద్దేశ్యంతోనే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు స్పష్టం చేశారు.75 ఏండ్ల స్వతంత్ర భారతంలో దేశాన్ని ఏలిన పార్టీలు గద్దెనెక్కడం, దిగడం తప్ప, దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణలో కష్టపడి పనిచేసినట్టే, దేశం కోసం కష్టపడి పనిచేసి సాధించి చూపెడతామని చెప్పారు. జాతీయ పార్టీ పెట్టాలనే నిర్ణయం ఆషామాషీగా తీసుకున్నది కాదనీ, బలమైన పునాదుల మీది నుంచే ఈ నిర్ణయం తీసుకున్నా మన్నారు. భారత దేశం రాష్ట్రాల సమాఖ్య అనీ, రెండూ కలిసి అభివద్ధి చెందితేనే సమగ్రాభివద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర జీఎస్డీపీ వాస్తవానికి రూ.14.5 లక్షల కోట్లు ఉండాల్సి ఉండగా, కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల ఇంకా అందుకోవాల్సినంత అభివద్ది, విజయాలను సాధించలేకపోతున్నామని తెలిపారు. దేశాన్ని లింగ, కుల వివక్షలు పట్టి పీడిస్తున్నాయన్నారు. దేశ జనాభాలో సగ భాగం అయిన మహిళలు అభివద్ధిలో భాగస్వాములు కాకపోవడం వల్ల నష్టం జరుగుతున్నదని అభిప్రాయపడ్డారు. అలాగే దేశ జనాభాలో 20 శాతం ఉన్న దళితులు కూడా కుల వివక్షకు గురికావడంతో దేశాభివద్ధిలో భాగస్వాములు కాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి స్థూల విషయాల్లో మౌలిక మార్పు రాకుండా సామాజిక పరిస్థితుల్లో గుణాత్మక మార్పు సాధ్యం కాదన్నారు. 1980 వరకు చైనా జీడీపీ మన దేశం కన్నా తక్కువగా ఉండేదనీ, 16 ట్రిలియన్ డాలర్ల ఎకనామితో చైనా నేడు ప్రపంచంలోనే ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని గుర్తుచేశారు. సౌత్ కొరియా, జపాన్, మలేసియా వంటి దేశాల్లోనూ అద్భుతాలు జరిగాయని ఉదహరించారు. రాష్ట్రంలో అమల్లోకి తెచ్చిన దళిత బంధు ప్రత్యేకంగా దళిత జనోద్ధరణకోసం అమలు చేస్తున్న కార్యక్రమని చెప్పారు. రాష్ట్రంలోని 8 లక్షల 40 వేల కుటుంబాలకు దళితబంధు, రైతుబంధు, రెండు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదనీ, ఇదే విషయాన్ని ఇక్కడకు వచ్చిన ప్రముఖ దళిత నాయకులు ఎంపీ తిరువలన్‌కు చెప్తే ఆయన ఆశ్చర్యానికి గురయ్యారని తెలిపారు. రాష్ట్రంలో 17 లక్షల 50 వేల దళిత కుటుంబాలున్నాయి. వారందరికీ దశల వారీగా దళిత బంధును అందిస్తూ ముందుకు సాగుతామన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ఇటువంటి ఆవిష్కరణలు దేశ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే అమలు చేసి వుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దేశంలో వ్యవసాయరంగం నిర్లక్ష్యానికి గురైందనీ, రైతులు తమ హక్కుల సాధన కోసం 13 నెలలు రోడ్ల మీద ధర్నాలు చేసే పరిస్థితులు తలెత్తడం దారుణమని అన్నారు. ఈ నేపథ్యంలోనే భారత దేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నామని వివరణ ఇచ్చారు. దేశ ప్రజల సమస్యలనే ఎజెండాగా చేసుకుని ముందుకు సాగుతామన్నారు.
నేనే వద్దన్నా...
పార్టీ పేరు మార్పు కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లు వస్తామన్నారనీ, వారి పరిస్థితులను అర్థం చేసుకుని తానే వద్దన్నానని సీఎం కేసీఆర్ చెప్పారు. తనతో కలిసి ముందుకు నడిచేందుకు దేశవ్యాప్తంగా అనేక పార్టీల నేతలు ముందుకు వస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వుంటూనే తాను దేశమంతా పర్యటిస్తానని తెలిపారు. దీనిలో ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
మహారాష్ట్ర నుంచే మొదలు...
తమ జాతీయ పార్టీ మొదటి కార్యక్షేత్రంగా మహారాష్ట్రను ఎంచుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీకి అనుబంధ రైతు సంఘటనను అక్కడి నుంచే ప్రారంభిస్తామన్నారు. దళిత, రైతు, గిరిజన ఉద్యమాల ద్వారా వాటినిప్రధాన ఎజెండాగా తీసుకోని ముందుకు సాగుతామన్నారు. పట్టుదలతో తెలంగాణ ప్రజలను ఎలాగైతే గెలిపించామో... అదే పద్దతిలో దేశ ప్రజలను కూడా లక్ష్య సాధనలో గెలిపిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
అభినందనలు...
అంతకుముందు కుమారస్వామి, తిరుమావళవన్ సీఎం కేసీఆర్‌కు శాలువా కప్పి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో తోడుగా ఉంటామనీ, కలిసి నడుస్తామనీ చెప్పారు. కార్యక్రమంలో జేడీఎస్ ఎమ్మెల్యేలు పుట్టరాజు, మహేశ్, హెచ్డీ రేవణ్ణ, డీసీ తమ్మన్న, వీరభద్రయ్య, హెచ్‌కే కుమారస్వామి, సురేశ్‌గౌడ, మంజునాథ్ దసరహళ్లి, ఏ మంజునాథ్, డాక్టర్ అన్నదాని, బోజే గౌడ, బండెప్ప కాశంపూర్, రాజా వెంకటప్ప నాయక్, దేవనాథ్ చౌహాన్, నాగనగౌడ కడకూర్, ఎమ్మెల్సీ బోజగౌడ తదితరులున్నారు. అలాగే వీసీకే అధినేత ఎంపీ తిరుమావలవన్తో పాటు, కార్యదర్శి బాలసింగం, ఆపార్టీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్జే విద్యాసాగర్, ఏపీ లీగల్ వింగ్ ప్రెసిడెంట్ నర్సింహ్మమూర్తి, ద్రవిడ దేశం పార్టీ అధ్యక్షుడు వంటెల కష్ణారావు తదితరులు హాజరయ్యారు.
ఆదిలాబాద్ రైతుల విరాళం
ఆదిలాబాద్ జిల్లా ముఖరాకె గ్రామ రైతులు బీఆర్ఎస్ పార్టీకి రూ.66వేల విరాళం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి పంపకం ద్వారా లభించిన 99 ఎకరాల భూముల్లో సోయాబీన్ పంట సాగుచేస్తున్నారు. దీనిలో నుంచి ఒక్కో రైతు 50 కిలోల పంటను బీఆర్ఎస్పార్టీకి విరాళంగా ప్రకటించారు.