Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండ్ల పరిశీలన ఆపేసిన అధికారులు
- ఎదురుచూస్తున్న లబ్దిదారులు
- నిబంధనల పేరుతో కాలయాపన
- చెబుతున్నదొకటి.. చేస్తున్నదొకటి..
- ఇంకెప్పుడు ఇస్తారని లబ్దిదారుల ఆందోళన
నవతెలంగాణ-సిటీబ్యూరో
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు కలగానే మిగిలి పోయాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రేటర్‌తోపాటు జిల్లాల్లోనూ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన అధికారులు మధ్యలోనే ఆపేశారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తామని చెబుతుంటే.. అధికారులు మాత్రం పరీశీలన పేరుతో కాలయాపన చేస్తున్నారు. లబ్దిదారుల ఎంపిక, ఇండ్ల కేటాయింపు గురించి గృహ నిర్మాణశాఖ వేర్వేరుగా జారీ చేసిన మూడు జీఓలు కీలకమని జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వాటి ప్రకారమే పని చేయ నున్నట్టు అంటున్నారు. 15 అక్టోబర్ 2015లో జీవో నెం. 10, అదే ఏడాది నవంబర్ 26న జీవో 12, 6 నవంబర్ 2020లో జారీ చేసిన జీఓ 3లోని అంశాలే కీలకంగా ఉన్నా యని అధికారులు చెబుతున్నారు. అయితే తుది ఉత్తర్వులు జారీచేసి రెండేండ్లు గడిచినా ఫలితంలేకుండా పోయింది. ఈ మూడు ఉత్తర్వుల ఆధారంగా రూపొందించిన మార్గ దర్శకాలను సైతం అధికారులు పక్కనపెట్టారనే విమర్శలూ లేకపోలేదు. మరోపక్క మార్గదర్శకాల ఆధారంగా అర్హుల జాబితా సిద్ధం చేస్తామని, లాటరీ ద్వారా లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని అధికారులు చెబుతున్నారు తప్ప ఇండ్లు మాత్రం ఇస్తలేరని పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 2.91 లక్షల ఇండ్లు
రాష్ట్ర వ్యాప్తంగా 2.91 లక్షల 'డబుల్' ఇండ్లు మంజూరవ్వగా.. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే లక్ష ఇండ్లు ఉన్నాయి. వాటిలో 70 వేల ఇండ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఇన్‌సిటు విధానంలో నిర్మించిన 3 వేల ఇండ్లను లబ్దిదారులకు కేటాయించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మిగిలిన ఇండ్లను మార్గదర్శకాల ఆధారంగా లబ్దిదారులను ఎంపికచేయాలని నిర్ణయించారు. 2018 ఎన్నికల ముందు జీహెచ్ఎంసీ పరిధిలో ఇండ్ల కోసం మీ సేవ సెంటర్లలో 7 లక్షల దరఖాస్తులు, కలెక్టరేట్లు, ఆఫ్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులతో కలిపి మొత్తం 10 లక్షలకుపైగానే ఉంటాయని అంచనా. అయితే గ్రేటర్లో నియోజకవర్గాల వారీగా దరఖాస్తులను వేరు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించి మధ్యలోనే ఆపేశారని సమాచారం. కొన్ని ప్రాంతాల్లో పరిశీలన కాలేదనని పేదలు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, ఇతరత్రా వివరాలు సేకరించారు. గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లో మొదటి విడతగా ఒక్కో అసెంబ్లీ పరిధిలో 1000- 1100 మంది లబ్దిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. దసరా పండుగ నాటికి మొదటి దశ పూర్తిచేస్తారని పేదలు ఆశలు పెట్టుకున్నారు. కాని రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మునుగోడు ఉప ఎన్నికల ఫలితంగా ఇప్పట్లో అయ్యేపరిస్థితి కనబడడంలేదని అధికారులు చెబుతున్నారు.
ఓటరు జాబితాలో పేరు...
ప్రధాన మార్గదర్శకాల ప్రకారం 2018 అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితాలో దరఖాస్తుదారుని పేరు తప్పనిసరిగా ఉండాలి. జీహెచ్ఎంసీ పరిధిలోని అడ్రస్‌తో ఆధార్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. దరఖాస్తుదారుని చిరునామా (అడ్రస్ ప్రూఫ్) జీహెచ్ఎంసీ పరిధిలో ఉండాలి. రూరల్ హౌసింగ్, అర్బన్ హౌసింగ్, ఇందిరమ్మ, జేఎన్ఎన్యూఆర్ఎం, ఐహెచ్ఎసస్డీపీ, వాంబే, రాజీవ్ గృహకల్ప, గతంలో ప్రభుత్వం అమలు చేసిన పక్కా ఇండ్ల పథకాల్లో లబ్దిదారులుగా ఉండకూడదు. జీవో 58, 59 లబ్దిదారులు సైతం అనర్హులు. ఈ వివరాలను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్(టీఎస్టీఎస్) నుంచి తీసుకుని పరిశీలించి దరఖాస్తుదారుల్లో పైన పేర్కొన్నవా రుంటే తిరస్కరించనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజ న (పీఎంఏవై)- హౌసింగ్ ఫర్ ఆల్ పథకం విధి విధానాలనూ లబ్దిదారుల ఎంపిక చేయడానికి పరిశీలించ నున్నారు. పీఎంఏవై కింద గృహ రుణాల్లో సబ్సిడీ పొందిన వారు సైతం డబుల్ ఇండ్లకు అనర్హులు. గ్రేటర్ బయటి ప్రాంతాల్లో నిర్మించిన ఇండ్లలో 10 శాతం/1000 రెండింటి లో ఏది తక్కువగా ఉంటే అన్ని ఇండ్లను ఆ నియోజక వర్గం లోని స్థానికుల్లో అర్హులకు కేటాయించనున్నారు. లబ్దిదారుని కుటుంబం బీపీఎల్ అయి ఉండాలి. ఇల్లు లేని, గుడిసెలు, కచ్చా ఇండ్లు, అద్దె ఇండ్లల్లో నివసించే వారు డబుల్ ఇండ్లకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, మైనార్టీలకు ఏడు శాతం, మిగతా ఇండ్లు ఇతరులకు కేటాయించేలా జీఓలో పొందుపర్చారు. పట్టణ ప్రాంతాల్లో అయితే ఎస్సీ-17, ఎస్టీ 6, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఆధారంగా ఇండ్లను కేటాయించనున్నారు. గ్రేటర్లో మాత్రం జీహెచ్ఎంసీ యూనిట్‌గా ఆయా కేటగిరీలకు ఇండ్లు కేటాయించనున్నారు.
70వేల ఇండ్లు..
జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లకుగాను 70 వేల ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 30 ఇండ్లు పూర్తిచేయడానికి నిధుల్లేకపోవడంతో మధ్యలోనే ఆపేశారు. అయితే పూర్తయిన ఇండ్లకు సంబంధించి కిటికీలు, డ్రయినేజీ పైపులు, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్తన్నారని, ఇండ్లకు కాపలాదారులు కరువయ్యారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్లో ఎనిమిదేండ్లుగా 4 వేలకు మించి ఇండ్లను లబ్దిదారులకు అందజేయలేదని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికైనా నిబంధనల పేరుతో కాలయాపన చేయకుండా లబ్దిదారులను గుర్తించి ఇండ్లను అందజేయాలని డిమాండ్ చేశారు.