Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండ్ల పథకానికి కొత్త నిబంధన
- దాని ఆధారంగానే మూడు లక్షల రూపాయల సాయం
- అవినీతికి ఆస్కారం ఉండొద్దనే ఈ నిర్ణయం
- సూత్రప్రాయంగా సర్కారు సమ్మతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇంటి జాగా ఉంటే మూడు లక్షల రూపాయలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. దీన్ని పకడ్బంధీగా అమలు చేయడంతోపాటు అక్రమాలకు తావులేకుండా తగిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నది. అందుకు ప్రతి ఇంటి స్థలానికీ జియోట్యాగింగ్ చేయనున్నది. దీనికి సీఎం కేసీఆర్ కూడా ఆమోదముద్ర వేసినట్టు తెలిసింది. ఈ టెక్నాలజీ ద్వారా లబ్దిదారుని ఇంటి జాగా నాలుగు మూలలను కవర్ చేస్తూ ఫొటో తీస్తారు. దాన్ని అప్లోడ్ చేసి జియోట్యాగ్ ఇస్తారు. దీంతో ఇంటి నిర్మాణం పనులు పూర్తయ్యేదాక జియోట్యాగ్ గుర్తించిన ఆ జాగాకు నిధులు మంజూరవుతాయి. జియోట్యాగ్ అయిన తర్వాత జాగా మార్చుకున్నా ఫలితం ఉండదు. ఇతర ప్రదేశాల్లో నిర్మాణాలు చేపట్టినా, సరిహద్దులు జరిగినా అది గుర్తించదు. ఫలితంగా నిర్మాణానికి డబ్బులు విడుదల చేయడం కుదరదు. హరితహారం, గొర్రెల పంపిణీ, ఇసుక లారీలు, సివిల్ సప్లరు శాఖ బియ్యం బస్తాల లెక్కల కోసం ఈ టెక్నాలజీని రాష్ట్ర సర్కారు ఉపయోగిస్తున్నది. తాజాగా గృహ నిర్మాణ శాఖ కూడా ఇండ్ల పథకంలో అక్రమాలకు చోటులేకుండా జియోట్యాగ్ ఉపయోగించనుంది. దీని ద్వారా లబ్దిదారులకు నేరుగా డబ్బులు అందించాలని సర్కారు భావిస్తున్నది. ఇప్పటికే దీనిపై అధికారులు కసరత్తు మొదలు పెట్టినట్టు తెలిసింది. ఇంటి జాగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు ఇస్తుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టిన సర్కారు...రెండు లక్షల ఇండ్లు పూర్తి చేసింది. మరో లక్ష ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వాటిలో ఇప్పటికే ఐదువేల మంది లబ్దిదారులకు ఇండ్ల కేటాయింపులు జరిగాయి. మిగతా ఇండ్లను లబ్దిదారులను కేటాయించేందుకు ప్రభుత్వానికి కత్తిమీద సాములా తయారైంది. రెండు గదుల ఇండ్ల కోసం దాదాపు 6.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం కడుతున్నది మూడు లక్షల ఇండ్లు. అందులో నుంచి మూడు లక్షల మందిని ఎంపిక చేయడం పెద్ద సవాల్‌గా మారింది. ఎవర్ని ఎంపిక చేసినా ఇంకొకరు ఆందోళన చేసే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సెలక్షన్ కమిటీలు కూడా చేతులెత్తేశాయి. ఈ నేపథ్యంలో ఇంటి జాగాకు మూడు లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే జియోట్యాగ్ అంశం తెరపైకి వచ్చింది. గతంలో ఇందిరమ్మ ఇండ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలొచ్చిన విషయం తెలిసిందే. స్థానిక ప్రజాప్రతినిధులు తమకు నచ్చిన వారికి రెండు, మూడు ఇండ్లకు కూడా అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కుమ్మక్కై పెద్ద ఎత్తున అవినీతికి పాల్పపడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రద్దు చేసి, డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రవేశ పెట్టింది. దీనికి వ్యయం ఎక్కువ కావడంతో ఇప్పుడు ఇంటి జాగాకు మూడు లక్షలు ఇస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటించింది.