Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిట్టల్లా రాలిపోతున్న వీఆర్ఏలు
- వాటాబందీపై పాలోళ్లతో సెటిల్మెంట్లకు అప్పులు
- తీర్చలేక..వడ్డీలు కట్టలేక తిప్పలు
- పేస్కేలు వస్తుందో? రాదో ఆందోళన ఓవైపు
- లోలోన కుమిలిపోతూ గుండెపోట్లతో కుప్పకూలుతున్న వైనం
- అప్పులోళ్ల పోరుతో ఆత్మహత్య చేసుకుంటున్న మరికొందరు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలియక...అప్పులోల్ల పోరు పడలేక...పేస్కేలు వస్తుందనే నమ్మకం లేక రాష్ట్రంలో రెండు నెలల నుంచి రోజుకో వీఆర్ఏ తనువు చాలిస్తున్నారు. రాష్ట్రమేర్పడ్డాక సర్కారు ఉద్యోగాన్ని పర్మినెంట్ చేస్తుందనే ఆశతో వాటాబంధీ చిక్కు రాకుండా వీఆర్ఏలు పాలోళ్లతో సెటిల్మెంట్ చేసుకున్నారు. దానికి లక్షలకు లక్షలు అప్పుచేశారు. వాటికి వడ్డీలు కట్టలేక తిప్పలు పడుతున్నారు. మరోవైపు సర్కారు ఇచ్చిన పేస్కేలు, ప్రమోషన్లు, వారసత్వ ఉద్యోగాల హామీలు ప్రకటించి రెండేండ్లు దాటినా జీవోలు రాక నానా హైరానా పడుతున్నారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు అన్ని ఒత్తిళ్లూ వీఆర్ఏలపై పడటంతో తట్టుకోలేక కుప్పకూలిపోతున్నారు. ఇంకొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీఆర్ఏల 73 రోజుల సమ్మె కాలంలో 65 మంది దాకా మరణించారంటేనే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో 23,046 మంది వీఆర్ఏ పోస్టులుండగా..ప్రస్తుతం 21,433 మంది విధుల్లో ఉన్నారు. వారిలో పరీక్షల ద్వారా నియమితులైన డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏలు 1800కిపైగా ఉన్నారు. వీరు పోను మిగితా వారంతా వారసత్వంగా పనిచేస్తూ వస్తున్నారు. వాటాబందీ పద్దతి(తాత, తండ్రి, కొడుకులు, మనువళ్లు, వారసులు వంతుల వారీగా పంచుకోవడం)లో ఆరు నెలలు, ఏడాది, రెండేండ్లు పెట్టుకుని ఉద్యోగం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రమేర్పడ్డ తర్వాత తమ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని వీఆర్ఏలు ఆశపడ్డారు. తమకు ఉద్యోగానికి వాటాబందీ పద్ధతి అడ్డు రాకుండా ఉండేందుకు తమ పాలోళ్లతో కొందరు వీఆర్ఏలు సెటిల్మెంట్ చేసుకున్నారు. దీనికిగానూ తమ పాలోళ్లకు తలా లక్ష, రెండు, మూడు లక్షలు ఇచ్చి అడ్డురాకూడదని ఒప్పందం చేసుకున్నారు. వారు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ సామాజిక తరగతివారు కావడంతో ఆర్థిక పరిస్థితులు అంతంతే. తమ ఉద్యోగం పర్మినెంట్ అవుతుందనే ఉద్దేశంతో సెటిల్మెంట్ల కోసం ఒక్కొక్కరు స్థాయిని బట్టి మూడు నుంచి పది లక్షల దాకా అప్పులు చేసి కట్టారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీర్ఏలకు పేస్కేలు ఇస్తాం..వారసత్వ ఉద్యోగాలిస్తాం...ప్రమోషన్లు ఇస్తామని చెప్పడంతో తమ బతుకులు బాగుపడ్డట్టే అని ఆశపడ్డారు. కానీ, హామీ ఇచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. పైగా, ఆ శాఖలోకి మారుస్తారు? ఈ శాఖలోకి మారుస్తారు? తీసేస్తారు? అనే రాష్ట్ర ప్రభుత్వ లీకులతో తమ బతుకులు ఏమవుతాయో అన్న సందిగ్ధంలో వారు పడిపోయారు. చదువు లేని వారిని తీసేస్తారన్న ప్రచారం మరింత కలవరపాటుకు గురిచేసింది. ఉంటుందో? లేదో? తెలియని ఉద్యోగం ఓవైపు అయితే...మరోవైపు ఏండ్ల తరబడి వేచి ఉన్న అప్పుల వారి పోరు తీవ్రమైంది. ఇలాంటి అనివార్య పరిస్థితుల్లోనే వారు సమ్మెలోకి వెళ్లారు. వారం..పదిరోజులు..పక్షం రోజులు...నెలా..రెండు నెలలు దాటినా సర్కారులో ఇసుమంతైనా చలనం రాకపోవడంతో వారిలో భయాందోళన రెట్టింపు అయింది.
రోజురోజుకీ పెరుగుతున్న వీఆర్ఏల మరణాలు
కామారెడ్డి జిల్లాలో వారం వ్యవధిలోనే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ జిల్లాలోని నాగిరెడ్డిపల్లి మండలం బొల్లారం గ్రామానికి చెందిన అశోక్(26) ఇక తనకు పేస్కేలు రాదోనేమోనన్న ఆందోళనకు గురై ఊర్లోని చెరువుకట్టపై ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. వాటాబందీ కొనుగోలు చేసేందుకుగానూ 2015లోనే ఆరు లక్షల రూపాయలు అప్పు చేశాడు. భూమి అమ్మి, భార్య బంగారాన్ని అమ్మేసి మరీ మూడు లక్షల అప్పు కట్టాడు. మిగతా అప్పుకు వడ్డీలు కడుతూ వచ్చాడు. అప్పులు, కుటుంబ భారం పెరగడం, ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన బొజ్జ వీరస్వామి అనే వీఆర్ఏ 41 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదనే బెంగతో గుండెపోటుకు గురై చనిపోయారు. దీంతో సహ వీఆర్ఏలు రోడ్డుపై మృతదేహంతో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం మండలంలోనూ ఒకతను ఆత్మహత్య చేసుకున్నారు. నారాయణపేట జిల్లా కోస్గిలో వీఆర్ఏ చెన్నయ్య దీక్షాశిబిరానికెళ్లేందుకు రెడీ అవుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వీరే కాదు ఇంచుమించు రోజుకొకరు చనిపోతున్నారు. దీనిని బట్టే పరిస్థితి తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
నాన్చొద్దు...త్వరగా తేల్చండి : పాలడుగు భాస్కర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కుటుంబ పోషణ భారమై, అప్పుల భారంతో కుమిలిపోతూ వీఆర్ఏలు కుప్పకూలిపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాన్చే కొద్దీ సమస్య మరింత తీవ్రమై వీఆర్ఏల మరణాలు పెరిగే ప్రమాదముంది. వీఆర్ఏలు గొంతెమ్మ కోరికలేం కోరట్లేదు. అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన మూడు హామీలనే అడుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దయచేసి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి. ఎంత త్వరగా జీవోలు విడుదల చేస్తే చావుల సంఖ్యను తగ్గించొచ్చు.