Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిడుగులు పడి ఐదుగురు మృతి
- బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పరామర్శ
నవతెలంగాణ- విలేకరులు
దసరా పండుగ వేళ సంతోషంగా గడిపిన కుటుంబాల్లో.. పిడుగులు విషాదాన్ని నింపాయి. భారీ వర్షంతోపాటు పిడుగులు పడి ఐదుగురు చనిపోయారు. వివరాలిలా ఉన్నాయి..వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని బండౌతపురం గ్రామానికి చెందిన కొందరు యువకులు బుధవారం సాయంత్రం పెద్దబండ సమీపంలో దావత్ చేసుకున్నారు. ఆ సమయంలో తేలకపాటి వర్షంతోపాటు పిడుగు పడింది. దాంతో మరుపట్ల సాంబరాజు(23), నేరెళ్లి శివకృష్ణ(19), జిట్టబోయిన సాయికుమార్(19) అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ యువకులకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స అంది స్తున్నారు. టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వర్ధన్నపేట బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.
యువకుడు మృతి
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధి సీతంపేట సమీపంలోని గార్ల పెద్ద చెరువును చూసేందుకు వడ్డెర బజార్‌కు చెందిన వేముల సంపత్, అళ్లకుంట శేఖర్, రూపన్ రమేష్, బి.విజరు వెళ్లారు. ఒక్క సారిగా భారీ వర్షం రావడంతో సమీపంలో ఉన్న చెట్టు కిందకు వెళ్లారు. చెట్టుపై పిడుగు పడింది. దాంతో వేముల సంపత్(26) అక్కడికక్కడే మృతి చెందాడు. శేఖర్, విజరుకి తీవ్ర గాయాలయ్యాయి. రమేష్‌కు స్వల్ప గాయమైంది.
మేకల కాపరి..
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండల పాడు గ్రామానికి చెందిన బల్లి యాకోబు(65) మేకల కాపరి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి మేకలను తోలుకెళ్లాడు. ఇంటికి వచ్చే సమయంలో భారీ వర్షం కురవడంతో గొడుగు వేసుకుని చెట్టుకింద కూర్చున్నాడు. ఆ సమయంలో పిడుగుచెట్టు మీద పడటంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.