Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ క్యాడర్‌కు మల్లిఖార్జున ఖర్గే విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్నాననీ, తనకు ఓటు వేసి గెలిపించాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే పార్టీ క్యాడర్‌కు విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్త పర్యటనలో భాగంగా శనివారం నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇందిరాభవన్‌లో పీసీసీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. 'మాలో మాకే జరుగుతున్న ఎన్నిక ఇది. ఒకే పార్టీలోని నేతల మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది. బీజేపీ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఎన్నిక జరగలేదు. ఈ నెల 17న ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి. అధ్యక్ష బరిలో ఉన్నా. అందరి మద్దతు కోరుతున్నా. తొమ్మిదివేలకు పైగా ఉన్న ఓటర్లను నేరుగా కలిసి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నా. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పర్యటించాను. కాంగ్రెస్ ఓటర్లను అభ్యర్థిస్తున్నాను' అని విజ్ఞప్తి చేశారు. 138 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌లో ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు ఎన్నికలు జరిగాయన్నారు. ఉదరుపూర్ చింతన్ శిబిర్‌లో తీసుకున్న డిక్లరేషన్‌ను అమలు చేస్తానన్నారు. రైతులు, యువత, మహిళా అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తానని చెప్పారు. మోడీ పాలనలో అన్ని వ్యవస్థలు దుర్వినియోగమవుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ సర్కారు అమ్మేస్తున్నారని చెప్పారు. దీంతో పేదలకు అన్యాయం జరుగుతున్నదని అన్నారు. దేశంలో నిరుద్యోగ శాతాన్ని తగ్గిస్తాననీ, ప్రధాని మోడీ ప్రగల్భాలు పలికారనీ, కోవిడ్ తర్వాత కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగం మరింత పెరిగిందని వివరించారు. బీజేపీ పాలనలో రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే రూ.82కు పడిపోయిందనీ, దీనివల్ల పెట్రోల్, డీజిల్‌తో పాటు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.