Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ : టీకేజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా అక్టోబర్ 19న యాదగిరిగుట్టలో జరిగే భారీ ప్రదర్శన బహిరంగ సభను నిర్వహించనున్నట్టు టీకేజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ ప్రకటించారు. దానికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అవిష్కరించారు. కార్యక్రమంలో మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి బొలగాని జయరాములు, రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజ్ గౌడ్, గౌరవ సలహాదారులు చిలువేరు సమ్మయ్య, భూపతి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
యూ.వెంకట్ నర్సయ్య, బి.వెంకట మల్లయ్య, గైని వెంకన్న, చౌగాని సీతరాములు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, యస్.రమేష్ గౌడ్, ఎల్గురి గోవింద్, గాలి అంజయ్య, కృష్ణస్వామి, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సురుగు రాజేష్, నేమిలే మహేందర్, పాండవుల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు గీతన్న బంధు ప్రకటించి పది లక్షల ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వృత్తికి ఉపయోగపడే విధంగా ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని కోరారు.
ఐదు లక్షల కుటుంబాలు రాష్ట్రంలో ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయనీ, వీరికి బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించి సొసైటీలకు భూమి, కల్లుకు మార్కెట్, నీరా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పింఛన్‌ను రూ. 5 వేలకు, ఎక్స్ గ్రేషియా పది లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ప్రతిష్టించాలనీ, తదితర 20 డిమాండ్లు పరిష్కారం చేయాలని కోరుతూ యాదగిరిగుట్టలో జరిగే భారీ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. 20,21 తేదీల్లో రాష్ట్ర మూడో మహాసభలను నిర్వహిస్తున్నామనీ, రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.